మూడేళ్ళ క్రితం కనిపించకుండా పోయిన ఓ వివాహిత… నమ్మలేని పరిస్థితుల్లో కనిపించింది. అప్పటికి అప్పుడే పుట్టిన బిడ్డను కూడా వదిలేసి, భర్తను బిడ్డను వదిలేసి, పచ్చిబాలింతగానే వెళ్ళిపోయింది. ఆమె పేరు జయశ్రీ. తమిళనాడులోని మధురై జిల్లా కీలపంగడిలో శ్రావణం అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. 2019లో ఆమెకు ఓ బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే జయశ్రీ భర్తను, బిడ్డను వదిలేసి పోయింది. ఆమె కోసం భర్త చాలాచోట్ల వెతికాడు. కానీ ఆమె జాడ తెలియలేదు. బంధువులు, స్నేహితులు కూడా ఆమె కోసం వెతికారు. పోలీసులు కూడా ఆమె కోసం గాలించారు. చివరకు భర్త మద్రాస్ హైకోర్టులో తన భార్యను వెతికి పెట్టాలని అభ్యర్ధించాడు. అయితే భర్తకు, బంధువులకు, పోలీసులకు షాక్ తగిలే వార్త తెలిసింది.
జయశ్రీ చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో పని చేస్తోందని, ఆమె సెక్స్ మార్పిడి చేయించుకుని మగవాడిగా మారి మరో గాళ్ ఫ్రెండ్ తో సహజీవనం చేస్తోందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. భర్తను బిడ్డను వదిలేసిన తర్వాత తన ప్లస్ టూ స్నేహితురాలైన దుర్గాదేవి వద్దకు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వారిద్దరూ చెన్నైకి వచ్చారు. ఓ స్టార్ హోటల్ లో పని చేస్తూ సహజీవనం చేస్తున్నారు. తనకిక ఆడ బతుకు అవసరం లేదనుకున్నానని, అందుకే తాను మగవాడిగా మారి, తన హైస్కూల్ గాళ్ ఫ్రెండ్ తో సంతోషంగా గడుపుతున్నానని చెప్పింది. ఈ విషయం హైకోర్టుకు తెలిపారు పోలీసులు. న్యాయస్థానం కూడా ఆమె మేజర్ కాబట్టి, తన ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చని, ఈ విషయంలో తామేమీ చేయలేమని చెప్పింది.