తొలకరిజల్లుకు తడిసిన మట్టి నుంచి అద్భుత పరిమళం..

  0
  467

  ఆల్చిప్పలో పడ్డ వానచినుకు ముత్యం అయినట్టు ఆ గ్రామంలో కురిసే ప్రతి తొలకరి చినుకు సెంటుగా మారుతుంది. ఇదేదో అభూతకల్పన కాదు. కనోజ్ సెంట్, లేదా కనోజ్ అత్తరుగా కొన్ని వేల సంవత్సరాలనుంచి మన దేశంలో పేరు పొందిన ఆ పరిమళ ద్రవ్యం ఆ గ్రామంలో మట్టినుంచే తయారు చేస్తారంటే బహుశా తెలియనివారికి విచిత్రమే. తొలకరి జల్లు మట్టినుంచి తయారయ్యే ఈ సెంటు ఈరోజుకి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ లో ఉంది. కనోజ్ గంగానదీ తీరంలో ఉత్తర ప్రదేశ్ లో ఉంది. ఈ కనోజ్ సెంట్ వల్ల ఈ గ్రామానికి భారత పరిమళ రాజధాని అని కూడా పేరుంది. పూర్వ కాలంలో మధ్య తూర్పు దేశాలనుంచి మన దేశానికి సుగంధ పరిమళాలు దిగుమతి చేసుకునేవారు. కనోజ్ లో ఈ రోజుకీ ప్రాచీన కాలంనాటి పద్ధతుల్లోనే సెంటు తయారు చేస్తారు. మిట్టీ అత్తర్ అనేది చాలామంచి సెంటు. పెద్ద పెద్ద రాగి పాత్రలను గాడి పొయ్యిలో ఉంచి దీన్ని తయారు చేస్తారు.

  తొలకరి జల్లు పడిన వెంటనే చుట్టుపక్కల గ్రామాలనుంచి తొలకరి జల్లు పడ్డ మట్టిని తీసుకొస్తారు. సూర్యోదయం కాకముందే, ఎండక ముందే దాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి రాగిపాత్రలో వేసి, ఉడకబెడతారు. ఆ రాగిపాత్రలో నీరుపోసి కింద మంట పెట్టి పూర్తిగా కప్పివేస్తారు. ఆవిరి బయటకు పోకుండా ఒకరకమైన బంకమట్టితో సీల్ చేసేస్తారు. కట్టెలు లేదా ఆవుపేడతోనే మంటవేస్తారు. రాగిపాత్రలకు పైనుంచి రంధ్రం వేసి తొలకరి జల్లుతో తడిసిన మట్టిని ఉడకబెట్టగా వచ్చిన ఆవిరిని నీటి బొట్లుగా మార్చి వేరే పాత్రలోకి తీసుకుంటారు. ఇలా అత్తరుని సేకరించేందుకు వెదురు బొంగుల్ని వాడటం విశేషం. అత్యంత శ్రమతో కూడిన క్లిష్టమైన ఈ కార్యక్రమాన్ని ఓపికతో చేస్తారు.

  రాగిపాత్రల్లోకి వచ్చిన ఆవిరి ద్రవ రూపాన్ని గంధం కలసిన ఆయిల్ తో కలుపుతారు. ప్రతి పూటా కొంత సమయంలో ఈ మట్టిని ఉడకబెట్టే పాత్రలను చల్లటి గుడ్డతో కప్పడం, ఆవిరి బయటకు వచ్చేటట్టు చేయడం, దాని వేడిని తగ్గించడం, ఇలా చాలా కష్టతరమైన ఈ పనిని ఓపికగా చేస్తారు. ఆ తర్వాత ఆవిరితో వచ్చిన ద్రవాన్ని ఒంటె చర్మంతో చేసిన తోలు సంచుల్లో భద్రపరుస్తారు. ఇప్పుడిప్పుడే గేదె చర్మంతో చేసిన సంచులు కూడా వాడుతున్నారు. వీటిని కుప్పీలు అంటారు. దీనికి కొంచెం గంధం కలిపిన తర్వాత ఈ తోలు సంచులను ఎండలోపెడతారు. ఎండలో పెట్టినపుడు అత్తరులో ఉండే నీటి శాతం కూడా ఆవిరవుతుంది. అప్పుడు అసలైన అత్తరు దానిలో మిగిలిపోతుంది.

  దీంతో గులాబ్, కియోరా, హినా, చంపా, బకిల్, పారిజాత, మోతియా, జండా, రత్రాని, కదమ్ అనే అత్తరులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఇవన్నీ కూడా కనోజ్ లోనే తయారు చేస్తారు. ఆధునికంగా మిషనరీ ఎంత అభివృద్ది చెందినా కనోజ్ లో మాత్రం ప్రాచీన పద్ధతుల్లోనే 250 రకాల సెంట్లు తయారవుతాయి. మొఘల్ చక్రవర్తుల కాలంలోనే ఈ పరిశ్రమ బాగా అభివృద్ది చెంది ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. కనోజ్ పేరు ప్రపంచోలనే మారుమోగిపోయింది.

  ఇవీ చదవండి

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.