పాముపగ పన్నెండేళ్ళు ..అన్న మాట సంగతెలా ఉన్నా , ఈ కోతి పగతో ఆటో డ్రైవర్ జగదీష్ నరకయాతన అనుభవిస్తున్నాడు.. అటవీ శాఖ అధికారులు కూడా , కోతి మనిషిపై పగపట్టడం మొదటిసారి చూస్తున్నామని చెప్పారు.. దీని వెనుక అసలు నిజమేమిటో చూడండి.. కర్ణాటక లోని చిక్ మంగుళూరు కొట్టేగేహర గ్రామంలో ఓ కోతి చాలా రోజులుగా చేతుల్లోఉన్న ప్యాకెట్లు పెరుక్కుపోవడం , ఇళ్లలో దూరి తినే వస్తువులు తీసుకుపోవడం చేస్తోంది.. అన్ని కోతుల్లాగానే ఈ కోతికూడా ఇంతేలే అని సరిపెట్టుకున్నారు. అయితే స్కూల్స్ తీసిన తరువాత ఈ కోతి మకాం అక్కడకు మారింది. పిల్లల చేతుల్లో తినుబండారాలు తీసుకుపోవడం మొదలుపెట్టింది. దీంతో గ్రామస్తుల కోరిక మేరకు అటవీశాఖ అధికారులు వచ్చి కోతిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆటో డ్రైవర్ జగదీశ్ వాళ్లకు బాగా సహకరించాడు. మొదటి రోజు వాళ్ల ప్రయత్నం ఫలించలేదు.
దీంతో రెండో రోజు ఉదయాన్నే ఆటో డ్రైవర్ జగదీశ్ స్కూల్లో పిల్లలను వదిలి అటవీ అధికారులకోసం ఎదురు చూస్తుండగా , ఆ కోతి అతడిపై దాడి చేసి దారుణంగా గాయపరిచింది. అదిచాలక ఆటో పై పడి దాని కప్పు చించేసింది. జగదీష్ ని స్థానికులు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఎట్టకేలకు సాయంత్రానికి కోతిని పట్టుకొని 22 కిలోమీటర్ల దూరంలోని బాలూర్ అడవిలో అటవీశాఖ అధికారులు వదిలేశారు.. వారం తరువాత , జగదీశ్ గాయాలతో మళ్ళీ ఆటో వేసుకొని స్కూల్ కి వచ్చాడు.. అప్పటివరకు ఎక్కడ ఉండిందో గానీ , అతడు రావడంతోనే మళ్ళీ అతడిపై పడి తీవ్రంగా గాయపరిచింది. ఆటో కవర్లను చింపేసింది.. మళ్ళీ అటవీ శాఖ అధికారులు వచ్చి రెండు రోజుల ప్రయత్నంతో , 22 వ తేదీన కోతిని బేలూర్ అడవిలో 12 కిలోమీటర్ల లోపల వదిలేశారు.. ఇక అది మళ్ళీ రాలేదని అటవీ అధికారి మోహన్ కుమార్ చెప్పారు. మొదటిసారి పట్టుకున్నప్పుడు దాని చెవికి ట్యాగ్ వేశామని , రెండో సారి వచ్చింది కూడా అదేనని చెప్పారు.. తన సర్వీస్ లో మనుషులపై కోతి పాగా పట్టడం ఇదే మొదటిసారిగా చూశానని అన్నారు..
ఇవీ చదవండి..