కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచేవారుంటే… ఎంతటి కష్టాన్ని అయినా సునాయాసంగా దాటేయచ్చు. అలాగే సుఖంగా ఉన్నప్పుడు కష్టాల్లో మనకు తోడుగా నిలిచిన వారిని విస్మరించకుండా… వారి రుణం తీర్చుకోవడం సంస్కారానికి నిదర్శనం. ఒలింపిక్ విజేత మీరాబాయి చానూ ఇందుకు నిలువెత్తు దర్పణం.
టోక్యో ఒలింపిక్స్ లో మీరాబాయి చానూ 49 కేజీల కేటగిరీలో… స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మొత్తం 202 కేజీలు ఎత్తి రజతం సాధించి, భారత త్రివర్ణ పతాకాన్ని విశ్వక్రీడా యవనికపై సగర్వంగా రెపరెప లాడించింది. దేశానికి తొలి పతకం అందించడంతో యావత్ యావత్ దేశం ఉప్పొంగిపోయింది. కుగ్రామం నుంచి ఒలింపిక్ విజేత అయ్యేవరకు సాగిన ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఒకప్పుడు కూటి కోసం బరువులు ఎత్తిన చానూ, ఇప్పుడు దేశ ప్రతిష్ట కోసం వెయిట్ లిఫ్ట్ చేసి అందరిచే ప్రశంసలు అందుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే, తనకు సహకరించి, కష్టాల్లో తోడుగా నిలిచిన వారి రుణం తీర్చుకోవడం మరో ఎత్తు.
మణిపుర్ రాష్ట్రం ఇంఫాల్ జిల్లాలోని నాంగ్పోక్ కాచింగ్ అనే ఓ చిన్న గ్రామంలో పుట్టిన మీరాబాయి, తనకు ఊహ వచ్చిన నాటి నుంచి వెయిట్ లిఫ్టింగ్ పై దృష్టి పెట్టింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆ క్రీడలో నైపుణ్యం ప్రదర్శిస్తూ, అంచలంచెలుగా ఎదిగింది. అయితే ఆమె ఉన్న గ్రామం నుంచి ఖుమన్ లంపక్ స్పోర్ట్స్ అకాడమీకి వెళ్ళాలంటే సుమారు 25 కి.మీ ప్రయాణం చేయాల్సివచ్చేది. వెళ్ళేందుకు చార్జీలకు కూడా సరిగా డబ్బులు ఉండేవి కావు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమెకు తోడుగా నిలిచింది ట్రక్ డ్రైవర్లు. నది నుంచి ఇసుక లోడుతో వెళ్ళే ట్రక్ డ్రైవర్లే ఆమెకు అండగా నిలిచారు. మీరాబాయిని తమ ట్రక్కులో స్పోర్ట్స్ అకాడమీ వరకు ఉచితంగా చేర్చేవారు. తిరుగు ప్రయాణంలోనూ ఆమెను ట్రక్ లో ఎక్కించుకుని ఇంటి సమీపంలో దించేసి వెళ్ళేవారు. అలా ఆమె వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీసు చేస్తున్నంతకాలం ట్రక్ డ్రైవర్లు సహకరించారు.
అంతటి కష్టాల్లో తనకు వెన్నంటి నిలిచిన ఏ ట్రక్ డ్రైవర్ ని ఆమె మరిచిపోలేదు. ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తర్వాత తనను స్పోర్ట్స్ అకాడమీ వద్ద డ్రాప్ చేసిన ప్రతి ఒక్క ట్రక్ డ్రైవర్ ను గుర్తు చేసుకుంది. వారిని తన ఇంటికి పిలిచి భోజనాలు పెట్టింది. ఒక షర్ట్, స్కార్ఫ్ అందించింది. అలా 150 మంది ట్రక్ డ్రైవర్లకు కానుకలు ఇచ్చింది. కష్టకాలంలో వారు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంది. తన విజయం వెనక ఎవరి అండదండలు లేవన్నారు. అయితే ట్రక్ డ్రైవర్ల సహకారం మాత్రం మాటల్లో చెప్పలేనిదని.. వారే లేకుండా తాను ఈ స్థాయికి చేరుకోగలిగేదాన్నే కాదని నిగర్వంగా చెప్పింది. కష్టాల్లో తనకు తోడుగా నిలిచిన ట్రక్ డ్రైవర్లను తాను జీవితాంతం మర్చిపోనని, వారి రుణం తీర్చుకోలేనిదంటూ చెప్పింది. టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన గర్వాన్ని ఏమాత్రం ప్రదర్శించకుండా.., కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ట్రక్ డ్రైవర్ల రుణం తీర్చుకుని, కోట్లాది మంది హృదయాల్లో స్వర్ణ సింహాసనంపై అధిష్టించింది మీరాబాయి చానూ,