మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  0
  334

  ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉచిత హామీలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారా అని ప్రశ్నించింది. తమిళనాడులో ఇలాంటి ఉచిత పథకాల వల్ల, ఉత్తర భారత దేశం నుంచి చాలామంది కూలీలు కూడా తరలి వచ్చేస్తున్నారని దాఖలైన పిటిషన్ పై విచారణ ప్రారంభించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఉచిత పథకాల హేతుబద్ధతను ప్రశ్నించింది. జస్టిస్ ఎన్. కిరు బకరన్, పుహళేంది ఆధ్వర్యంలోని బెంచ్ ఉచిత పథకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ ప్రారంభించింది. కనీస వసతుల కల్పన ప్రభుత్వ బాధ్యత అని, పేదలకు అందాల్సిన పథకాలను, రాజకీయ ప్రయోజనాలకోసం ఇతరులకు కూడా వర్తింపజేయడం మంచి పద్ధతి కాదని కోర్టు అభిప్రాయపడింది.

  బియ్యం ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ప్రతి ఏడాదీ 2వేల కోట్లు నష్టం వస్తోందని, ఈ విషయంపై కూడా సమగ్ర నివేదిక సమర్పించాలని కోరింది. ఇదిలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో ప్రతి ఇంటికీ అన్నం వండి, కూరలు కూడా వండి తామే పంపిస్తామని, హోటళ్లలో భోజనం కూడా తినిపిస్తామని చెప్పే ప్రమాదం ఉందని తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి 20కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోందని, ప్రజలను ఓట్లు అమ్ముకునే విధంగా చేస్తున్నారని, ఒక ప్యాకెట్ బిర్యానీ, క్వార్టర్ బాటిల్, నాయకులను నిర్ణయిస్తాయా?, విజేతల్ని నిర్ణయిస్తాయా? అని ప్రశ్నించారు.

  ఇలాంటి పరిస్థితుల్లో ఓట్లు వేస్తే, నాయకుల్ని నిలదీసే నైతిక హక్కు ఓటర్లకు ఎలా ఉంటుందని కూడా సందేహం వ్యక్తం చేశారు. తమిళనాడులో ఓటర్లకు కలర్ టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు, ల్యాప్ టాప్ లు, వాషింగ్ మిషన్లు, మహిళలకు ఆర్థిక సహాయాలు, ఇలాంటి హామీలు ప్రజా స్వామ్యంలో ఎన్నికలను ఏ విధంగా ప్రభావింత చేస్తాయో అర్థం చేసుకోవాలన్నారు.

  ఉపాధికల్పన, మౌలిక వసతుల కల్పన ప్రజల ఆరోగ్యం, రవాణా, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేసే ఆలోచనలు మానేసి, ఉచిత పథకాలమీద ప్రజల ఓట్లు దండుకోవడం, అవినీతికరవిధానమేనని, ఇది ఎన్నికలలో పారదర్శకతను ప్రతిబింబించదని చెప్పారు. తమిళనాడులో ఇస్తున్న ఈ ఉచిత పథకాలకు ఆశపడి, ఇతర రాష్ట్రాలనుంచి వలస కూలీలు ఇక్కడికి వస్తుంటే, భవిష్యత్ లో ఇక్కడి ప్రజలు కూలీలు కాక తప్పదని చెప్పారు. గత 20ఏళ్లుగా ఉచిత పథకాల ప్రచారంతోనే రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని అన్నారు. ఉచిత పథకాలపై 20 ప్రశ్నలను ఎలక్షన్ కమిషన్ కి పంపుతూ ఏప్రిల్ 26వ తేదీలోగా వాటిపై సమాధానం చెప్పాలని కూడా కోర్టు ఆదేశించింది.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే.