రోడ్డు వేయిస్తేనే పెళ్ళి చేసుకుంటా..

    0
    155

    పెళ్ళి అన‌గానే.. అమ్మాయిలు ఎన్నో క‌ల‌లు కంటుంటారు. ఆ క‌ల‌లు నిజం చేసే వ‌రుడి కోసం ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అలాంటి వ‌రుడి కోసం ఆలోచిస్తుంటారు. కానీ ఇక్క‌డ ఈ అమ్మాయి మాత్రం అందరి కంటే భిన్న‌మైంది. ద‌శాబ్దాలుగా త‌మ గ్రామానికి ఉన్న రోడ్డు స‌మ‌స్య‌పై ఆలోచించింది. మా గ్రామానికి రోడ్డు వేయిస్తేనే పెళ్ళి చేసుకుంటాన‌ని శ‌ప‌ధం చేసింది. ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రికే లేఖ రాసింది. ఈ ఘ‌ట‌న‌ కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని మాయకొండ ప్రాంతంలో జ‌రిగింది. గ్రామానికి చెందిన బిందు అనే యువ‌తి. వ‌య‌సు 26 ఏళ్ళు. హాస్ట‌ల్ లో చ‌దువుకుంటూ ఎంఏ ఎక‌న‌మిక్స్ పూర్తి చేసింది. ప్ర‌స్తుతం ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. ఈ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో బస్సు సదుపాయం లేదు. ఇక వాన ప‌డితే చాలు రోడ్డంతా చిత్త‌డే. చ‌దువు కోవాలంటే మ‌రో ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుంది. అస‌లే పేద‌లు కావ‌డంతో అంత‌దూరం పిల్ల‌ల‌ను పంపించ‌లేక త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను స్కూల్ కి పంపించ‌డం కూడా మానేశారు. మ‌రోవైపు గ్రామంలో ఎవరైనా చావు బతుకుల్లో ఉన్నా.. గర్భిణిలు ప్రసవం నొప్పులతో బాధపడుతున్నా.. హాస్పిటల్ కు వెళ్లాలంటే అంబులెన్స్ రాని దుర్భర ప‌రిస్థితిలో ఆ గ్రామం ఉంది. ఇదిలావుంటే, ఆ గ్రామంలో యువ‌తీ యువ‌కుల‌కు క‌నీసం పెళ్ళి సంబంధాలు కూడా రావ‌డం లేద‌ట‌.

    ఈ నేప‌ధ్యంలో పెళ్ళి కాని బిందు .. త‌మ గ్రామ ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ ముఖ్య‌మంత్రి బ‌స్వ‌రాజ్ కు లేఖ రాసింది. గ్రామం అంతా సమస్యల నియలంగా మారింద‌ని, ఒక్కొక్క స‌మ‌స్య గురించి ఆ లేఖ‌లో పూస‌గుచ్చింది. స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి త‌మ గ్రామంలో ప‌రిస్థితులు ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే ఉన్న‌ట్లు, అభివృద్దికి ఆమ‌డ‌దూరంలో తామున్నామ‌ని చెప్పుకొచ్చింది. మా గ్రామానికి రోడ్డు వేస్తే త‌ప్ప‌, తాను పెళ్ళి చేసుకోన‌ని భీష్మించింది. ఈ లెట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో… సీఎం బ‌స్వ‌రాజ్ గ్రామ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. జిల్లా కలెక్టర్ మహంతేశ్‌ బీళగి రంగంలోకి దిగారు. ఆ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. యవతి కుటుంబంతో, గ్రామ‌స్తుల‌తో మాట్లాడారు. గ్రామ సమస్యల్ని మేం పరిష్కరిస్తాం.. నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆమెకు సూచించారు. కానీ గ్రామానికి రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యాకే వివాహం చేసుకుంటానని, ఆ వివాహానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తాన‌ని తెగేసి చెప్పింది బిందు. దీంతో గ్రామంలో రోడ్ల నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యాయి.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.