సిల్వర్ మీరా అలా .. బ్రాంజ్ సింధూ ఇలా..

    0
    326

    టోక్యో ఒలింపిక్స్ లో భార‌త్‌కు ప‌త‌కాల పంట కొన‌సాగుతోంది. మ‌ణిపూర్ వెయిట్ లిఫ్ట‌ర్ మీరాబాయి చానూ వెయిట్ లిఫ్టింగ్ లో ర‌జ‌త ప‌త‌కంతో మెరిసింది. తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింట‌న్ లో కాంస్యం సాధించింది. ఇద్ద‌రివీ గొప్ప విజ‌యాలే. ఇద్ద‌రూ దేశ‌కీర్తిని ఖండాంత‌రాల‌కు చాటారు. అయితే ప్రాచుర్యంలో మాత్రం పీవీ సింధు నాలుగు అడుగులు ముందుంది. ఈ తేడా ఏంటి ? భార‌తావ‌నికి తొలి ప‌త‌కం.. అందులోనూ ర‌జ‌తం అందించిన మీరాబాయి చానూకి లేని ప్రాచుర్యం, కాంస్యం సాధించిన పీవీ సింధుకి ఇవ్వ‌డంలో ఆంత‌ర్యం ఏమిటి ? ఇదంతా మీడియా మేనేజ్మెంట్ అనుకోవ‌చ్చా ? లేక సెల్ఫ్ ప్ర‌మోష‌న్ అనుకోవ‌చ్చా ?

    2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది పీవీ సింధు. వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పత‌కాలను గెలిచిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా రికార్డు సృష్టించింది. టోక్యో నుంచి ఢిల్లీ చేర‌గానే ఆమెకు ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. కేంద్ర‌మంత్రుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఆమెను ఆకాశానికెత్తేశారు. ప్ర‌శంస‌లు.., స‌త్కారాలు… అభినంద‌న‌లు… ఇలా ఒకటేమిటి. సింధుకి రాచ‌మ‌ర్యాద‌ల‌న్నీ జ‌రిగాయి. మీడియా మొత్తం ఆమె చుట్టూనే తిరిగింది. పీఎం న‌రేంద్ర‌మోడీతో ములాఖాత్‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌తో మీటింగ్… వ‌చ్చీరాగానే అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇక సింధుకి బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. విశాఖపట్నం రూర‌ల్ మండలంలోని చినగ‌దిలి వద్ద సర్వే నంబరు 72, 83 పరిధిలో రెండెక‌రాల భూమిని ఉచితంగా కేటాయించింది. ఇక ఒలింపిక్ క్రీడ‌ల్లో పాల్గొని కాంస్య ప‌త‌కం సాధించినందుకు ప్రోత్సాహ‌కంగా ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదును అందించింది.

    2016 రియో ఒలింపిక్స్‌లో ప‌త‌కాన్ని తృటిలో చేజార్చుకున్న మ‌ణిపూర్ ఆణిముత్యం మీరాబాయి చానూ మాత్రం… టోక్యో ఒలింపిక్స్ లో ర‌జ‌తం సాధించి రికార్డు సృష్టించింది. తెలుగు వీర‌తేజం క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రీ త‌ర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో ప‌త‌కం సాధించిన రెండో మ‌హిళ‌గా కీర్తి గ‌డించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాబాయి చానూకు మణిపూర్ ప్రభుత్వం ఎఎస్పీగా ఉద్యోగమిచ్చింది. కోటి రూపాయల పారితోషికం ప్రకటించింది. సామాన్యుడి నుంచి రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు ప్ర‌శంస‌లు అందుకుంది. అయినా ఆమె ఎక్క‌డా త‌న విజ‌య‌గ‌ర్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా సాధార‌ణ వ్య‌క్తిగా స్వ‌గ్రామానికి చేరుకుంది. త‌న వారితో క‌లిసి నేల‌మీద కూర్చుని భుజించింది. హంగుఆర్భాటాల‌కు పోకుండా నేల మీద నిలుచుంది.

    అయితే ర‌జ‌తం నుంచి కాంస్యం దిగిన‌ పీవీ సింధుని ఆకాశానికెత్తిసిన మీడియా… టోక్యో ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి భారత్‌కు శుభారంభం అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను ప్రాధాన్య‌త క‌ల్పించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి ? సింధు చుట్టూ తిరిగిన మీడియా… మీరా చుట్టూ తిర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి ? సింధుకి మొద‌టి నుంచి ప్రోత్సాహం ల‌భిస్తూనే ఉంది. తొలిసారి ర‌జ‌తం సాధించిన త‌ర్వాత ఆమెకు అండ‌దండ‌లు పెరిగాయి. ఎన్నో ర‌కాల ప్రోత్సాహ‌కాలు వ‌చ్చాయి. కానీ మీరాబాయి చానూ ప‌రిస్థితి వేరు. ఆమెకు స‌రైన వ‌స‌తులు కూడా లేవు. కూటి కోసం క‌ట్టెలు మోసిన ఆ చేతులు.. ఇప్పుడు ఒలింపిక్స్ లో ర‌జ‌తాన్ని సాధించాయి. శిక్ష‌ణ కోసం స్పోర్ట్స్ అకాడ‌మీ వెళ్ళేందుకు చార్జీలు కూడా లేనిప‌రిస్థితుల్లో ట్ర‌క్ డ్రైవ‌ర్ల స‌హాయం తీసుకుందామె. 2016 రియో ఒలింపిక్స్ లో ఒట్టి చేతుల‌తో తిరిగి వ‌చ్చిన మీరా… ఈసారి క‌ఠోర‌శ్ర‌మ‌తో టోక్యో ఒలింపిక్స్ లో ర‌జ‌తం సాధించి దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచింది. త‌న‌కు వెన్నంటి నిలిచి, ప‌రోక్షంగా త‌న విజ‌యానికి కార‌ణ‌మైన ట్ర‌క్ డ్రైవ‌ర్ల‌ను స‌న్మానించి కానుక‌లు అందించి త‌న ఔన్న‌త్యాన్ని చాటుకుందామె.

    సింధు ఎక్క‌డికి వెళ్ళినా, ఏం చేసినా పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసే మీడియా… క‌ష్టాల కొలిమిలో మేలిమి బంగారంగా మెరిసిన మీరాబాయి చానూకు ఇవ్వాల్సిన ప్రాచుర్యం మీడియా ఇవ్వ‌లేద‌నే చెప్పాలి. కింది స్థాయి నుంచి ఆకాశ‌మంత ఎత్తుకు ఎదిగిన ఆమెకు ఇచ్చిన ప్రాధాన్య‌త కూడా అంతంత మాత్ర‌మే. బ‌హుశా మీరాకు మీడియాను మేనేజ్ చేసే నైపుణ్యం లేక‌పోవ‌డ‌మే కార‌ణం కావ‌చ్చు. సెల్ఫ్ ప్ర‌మోష‌న్ చేసుకోవ‌డం చేత‌కాక‌పోవ‌డమూ కావ‌చ్చు. కార‌ణాలేవైనా మీడియాను ఇన్ ఫ్లుయెన్స్ చేయ‌గ‌ల‌గ‌డం ఒక ఆర్ట్. అది అంద‌రికీ సాధ్యం కాదు.

    ఇవీ చదవండి..

    కోడలితో అక్రమసంబంధం,కన్నకొడుకునే చంపేశాడు.

    ప్రేమికుల శవాలకు స్మశానంలో పెళ్లి..

    అడ్రెస్ అడిగి డ్రెస్ పై చెయ్యి వేశాడు..తర్వాత..?

    తిరుపతిలోనే నా పెళ్లి.. పెళ్ళికి మాత్రం చీర కట్టుకుంటా.. జాన్వీ.