గులాబ్ తుఫాను ఉత్తరాంధ్రలో గుబులు రేపుతుంది. అటుఇటు తిరిగి చివరకు ఈ తుఫాను శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. గులాబ్ తుఫాను గత అర్థరాత్రి తీవ్ర తుపానుగా బలపడింది. తీరం దాటే సమయంలో అతి మరింత తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొనింది. తుఫాను కారణంగా ఉత్తర కోస్తాలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు. సోమవారం వరకు సముద్రంలో వేటను నిషేదించారు. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీగా, కోస్తాఆంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. తుఫాను తీవ్రత దృష్ట్యా తీరంలో సహాయక చర్యల కోసం ప్రభుత్వం ప్రత్యేక దళాలను రంగంలోకి దించింది.
శ్రీకాకుళం , విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోతోటలకు భారీ నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.పోలీస్, రెవెన్యూ, రవాణా, టెలీ కమ్యూనికేషన్స్, విద్యుత్, తాగునీటి సరఫరా శాఖలను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లకు ఆదేశాలందాయి. రోడ్లు దెబ్బతిని ట్రాఫిక్ సమస్యలు ఎదురైతే యుద్ధప్రాతిపదికన సరిచేసేలా సిద్ధంగా ఉండాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది.
ఇవీ చదవండి..