హాల్ మార్క్ ఉన్నదంతా బంగారం కాదు..

  0
  802

  మెరిసేదంతా బంగారం కాదు అనేది పాత మాట.. ఇప్పుడు హాల్ మార్క్ వేసినవన్నీ బంగారం కాదనేది కొత్త మాట. అవును వెండి ఉంగరాలకు బంగారం కోటింగ్ వేసి, ఆ తర్వాత వాటికి హాల్ మార్క్ వేసి మరీ వ్యాపారం చేస్తున్నాడు ఓ మోసగాడు. అయితే ఇలా హాల్ మార్క్ వేసిన బంగారు ఆభరణాలను ఎవరికీ అమ్మేవాడు కాదు, కేవలం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకునేవాడు. అలా తాకట్టుపెట్టిన బంగారంతో ఏకంగా 6కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడట. చివరకు ఈ విషయం తెలిసిన తాకట్టు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారం హైదరాబాద్‌ బోరబండలో జరిగింది.

  బోరబండ వాసి వెంకటరెడ్డి గత కొన్నాళ్లుగా.. వెండి ఉంగరాలకు బంగారు పూత పూసి హల్ మార్క్ గుర్తు వేయించి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు. బోరబండలో నగల వ్యాపారి గణేష్ చౌదరి వద్ద.. ఉంగరాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్లాడు వెంకట్ రెడ్డి. ఐతే చాలా రోజుల వరకు వెంకట్ రెడ్డి రాకపోవడంతో ఉంగరాలను కరిగించే ప్రయత్నం చేశారు వ్యాపారి గణేష్ చౌదరి.

  మళ్లీ రెండు రోజుల క్రితం నకిలీ బంగారు ఉంగరాలు తీసుకొచ్చి తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు వెంకటరెడ్డి. దీంతో అతన్ని పట్టుకొని ఎస్సార్ నగర్ పోలీసులకు అప్పజెప్పాడు నగల వ్యాపారి గణేష్ చౌదరి. ఇప్పటివరకు నగరంలో 200 మంది దగ్గర నకిలీ బంగారం ఆభరణాలు తాకట్టు పెట్టి 6 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. వెంకట్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ ఆర్ నగర్ పోలీసులు. కాగా, సదరు వెంకటరెడ్డి బంగారు బాగోతాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.