మరోవైపు హైకోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు వీలుగా కోవిడ్ నోడల్ ఆఫీసర్ విధులలో మార్పులు చేర్పులు చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల ఫీజు చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని స్పష్టం చేసింది. రోగులకు బిల్లులు ఇచ్చేముందు నోడల్ ఆఫీసర్ వాటిపై సంతకం చేయాలని చెప్పింది. నిర్ణయించిన ధరల ప్రకారం బిల్లులు ఇచ్చారా లేదా అని నోడల్ ఆఫీసర్ పరిశీలించి ఆ తర్వాతే వాటిపై సంతకం చేయాలంది. నోడల్ అధికారి సంతకం లేకుండా కోవిడ్ ఆసుపత్రులు ఫీజులు తీసుకోకూడదని స్పష్టం చేసింది. వాస్తవానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సకు.. ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజు మాత్రమే తీసుకోవాల్సి ఉండగా చాలా చోట్ల ఆ నిబంధనను తుంగలో తొక్కేశాయి యాజమాన్యాలు. లెక్కల్లోకి రాకుండా.. చిత్తు కాగితాలపై బిల్లులు రాసిచ్చి వసూలు చేసుకునేవారు. వీటిపై పేషెంట్ పేరు మినహా ఇంకే వివరాలు ఉండవు, వీటిని ఎక్కడా నమోదు కూడా చేసుకోరు కాబట్టి ఆధారాలు ఉండవు. నోడల్ ఆఫీసర్లను మేనేజ్ చేసుకుంటూ ఇలా దోపిడీకి తెగబడే ఆస్పత్రులకు కొత్త రూల్స్ తో చెక్ పడినట్టే చెప్పాలి. బిల్లుపై నోడల్ ఆఫీసర్ సంతకం ఉంటుంది కాబట్టి, అక్రమాలపై బాధితులు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.