ప్రపంచంలో అతిపెద్దదైన విమానం, రష్యా ,ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ముక్కలైందని తెలుస్తోంది. AN225 పేరుతో పిలవబడే ఈ విమానం ఆరు ఇంజన్లతో తయారైంది. వస్తువుల రవాణాకు ఉపయోగించే ఈ విమానం, ఉక్రెయిన్ లోని యాంటేనో విమానయాన సంస్థలో తయారైంది. ఈ విమానం ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని యాంటేనో అంతర్జాతీయ విమానాశ్రయంలోని హ్యాంగర్ లో ఉండగా, రష్యా యుద్ధవిమానం దాని మీదికి క్షిపణులను వదిలి.. పేల్చేసినట్టు చెబుతున్నారు.
ఫిబ్రవరి 25వ తేదీన యాంటేనో విమానాశ్రయాన్ని రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు మిలిటరీ వాహనాలు యుద్ధ ట్యాంకులను ఆ విమానాశ్రయంలోకే రష్యా దళాలు దించుతున్నాయి. ఉక్రెయిన్ దేశానికి గర్వకారణంగా ఈ విమానాన్ని చెప్పుకుంటారు. అలాంటి విమానాన్ని రష్యా దళాలు పేల్చివేయడం సంచలనమైంది. విమానాశ్రయం ప్రస్తుతానికి రష్యా దళాల అధీనంలో ఉండటంతో ఎంతమేరకు విమానం దెబ్బతిందో తెలియడం లేదు. విమానంపై దాడి జరిగిందని మాత్రం తెలుస్తోంది.