గుజరాత్ కి ఓ బ్రాహ్మణ యువతి తనకు ఏ కులం, మతం ప్రస్తావన లేకుండా సర్టిఫికేట్ కావాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని అహ్మదాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కాజల్ గోవింద్ భాయ్ మంజుల అనే 36 ఏళ్ళ యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. సమాజంలో కుల, మత అసమానతల వల్ల తాను విసిగిపోయానని, తాను అగ్ర కులానికి చెందిన యువతినైనా, కులం, మతం లేని సమాజం కావాలని కోరుకుంటున్నానని చెప్పింది. కులం కారణంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఇది ఒకరకంగా మేలు చేయకపోగా, నష్టమే చేస్తోందని పేర్కొంది.
రాజ్ గోర్ బ్రాహ్మణ కులానికి చెందిన యువతి ఇదివరకే తన పేరులో నుంచి తన గోత్రాన్ని తెలియజేసే షిలు అనే పదాన్ని తొలగించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉన్న కాజల్.. కుటుంబంతో విభేదించి విడిగా ఉంటోంది. ఆమె కులం, మతం వద్దన్నందుకు కుటుంబంలో కూడా గొడవలు చెలరేగడంతో పక్కకు వచ్చేసింది. ప్రస్తుతం తనను తాను పోషించుకుంటున్నానని, తన పని తాను చేసుకుంటున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో కులం, మతం ఏమిటన్నది ఆమె వాదన.
తనకు కులం, మతం పెట్టడం ఇష్టం లేదని… ఇవి రెండూ జ్ఞానాన్ని ప్రసాదించేవి కాదని చెప్పింది. ఇటీవల చెన్నయ్ లో కూడా స్నేహ ప్రతిభరాజా అనే యువతి తన సర్టిఫికెట్ లో నుంచి కులం, మతం రెండింటినీ తీసి వేయించి, నో క్యాస్ట్, నో రెలిజియన్ సర్టిఫికెట్ పొందిందని, అదే తరహాలో తనకు ఇప్పుడు సర్టిఫికెట్ మంజూరు చేయాలని కాజల్ తన న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. వచ్చేవారం ఈ పిటీషన్ విచారణకు రానుంది.