భర్త గిఫ్టుగా ఇచ్చిన నగదుతోనే… సుపారీ ఇచ్చి కట్టుకున్నోడిని కడతేర్చింది ఓ భార్య. ప్రియుడితో హాయిగా ఉండాలని భావించి, కిల్లర్‌కి సుపారీ ఇచ్చి… హత్యను ప్రమాదంగా చిత్రీకరించింది. చివరికి కిల్లర్ దొరికిపోవడంతో డొంకంతా కదిలి… చివరికి కటకటాలపాలైంది. అహ్మదాబాద్ రాష్ట్రంలోని గోంతీపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
శైలేష్ ప్రజాపతి అనే 43 ఏళ్ళ భర్త, తన భార్య స్వాతికి బర్త్ డే గిఫ్టుగా 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. దీంతో ఎంతో సంబరపడిపోయిందా భార్య. అయితే ఆ డబ్బుతోనే భర్త ప్రాణాలు తీయించింది. ప్రియుడు నితిన్ కోసం, భర్త అడ్డు తొలగించేందుకు కుట్ర చేసింది. మహ్మద్ యాసిన్ అన్సారీ అనే వ్యక్తికి 10 లక్షలు సుపారీ ఇచ్చి తన భర్తను చంపేయాలని, అది ప్రమాదంగా ఉండాలని సూచించింది. అదే విధంగా అన్సారీ ప్లాన్‌ని అమలు చేశాడు.
భర్త శైలేష్ వాకింగ్ చేస్తుండగా ట్రక్కుతో వచ్చిన అన్సారీ… శైలేష్‌ను గుద్ది చంపేశాడు. జూన్ 24న ఈ యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడని ఆ దిశగానే పోలీసులు తొలుత కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఓ కేసులో అన్సారీ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ కేసు విచారణ చేస్తున్న పోలీసులు… జూన్ 24న జరిగిన రోడ్డు ప్రమాదం గురించి కూడా చెప్పడంతో .. ఖాకీలు అవాక్కయ్యారు. దీంతో ఈ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. అన్సారీకి సహకరించిన మరో ఇద్దరు రహీల్, అక్రమ్‌లతో పాటు భార్య స్వాతి, ప్రియుడు నితిన్‌లను పోలీసులు అరెస్టు చేసి జైలుకి తరలించారు.