భార్యను చంపి కరోనాతో చనిపోయిందని నమ్మించి..

  0
  2383

  ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. అంతే కాదు, ఆమె కరోనాతో చనిపోయినట్టు, ఆస్పత్రి సిబ్బంది శవానికి అంత్యక్రియలు చేసినట్టు కుటుంబ సభ్యుల్ని నమ్మించాడు. చివరకు పాపం పండి, భార్య శవం పోలీసులకు చిక్కడంతో అతడ్ని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన తిరుపతిలో జరిగింది.
  మిస్టరీ వీడింది..
  తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక కనిపించిన మృతదేహం మిస్టరీ వీడింది. ఐదు రోజుల క్రితం ఆస్పత్రి వెనుక పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించిన శవం కేసును తేల్చారు పోలీసులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ‌కుడే ఆమెను హ‌త్య చేశాడ‌ని గుర్తించారు.
  తిరుప‌తి రుయా ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ఇటీవ‌ల‌ కాలిన స్థితిలో ఓ మృత‌దేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన స్థానిక పోలీసులు.. మృతదేహం పుంగ‌నూరు మండ‌లం రామ‌సముద్రానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని భువనేశ్వరిగా నిర్దారించారు. భార్య భువనేశ్వరిని ఇంట్లో హ‌త్య చేసి రుయా ఆసుప‌త్రి ఆవరణలో మృతదేహాన్ని భర్త శ్రీ‌కాంత్ రెడ్డి కాల్చినట్లుగా తేలింది. రెండున్న‌రేళ్ల క్రితం వారిద్ద‌రు ప్రేమ‌ వివాహం చేసుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.
  పోలీసు జరిపిన విచారణలో బంధువుల వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆడిన డ్రామా వెలుగులోకి వచ్చింది. తన భార్యకు కరోనా డెల్టా వేరియంట్ వచ్చిందని… రుయా ఆసుపత్రిలో చేర్చానని… కుటుంబ సభ్యులకు శ్రీకాంత్ రెడ్డి నమ్మించాడు. ఆ తర్వాత భువనేశ్వరి డెల్టా వేరియంట్ తో భార్య చనిపోయిందని నమ్మించాడు. ఇందులో భాగంగా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు బంధువులకు ఇవ్వడం లేదని కట్టుకథ చెప్పాడు.
  అంతేకాదు బంధువులను రుయా ఆస్పత్రిలోని మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాలన్నింటినీ వెదికినట్టు ఓ సీన్ క్రియేట్ చేశాడు. అయితే అక్కడ యువతి మృత దేహం లేకపోయే సరికి రుయా సిబ్బంది అంత్యక్రియలు చేసేసారని కుటుంబ సభ్యులని నమ్మించాడు శ్రీకాంత్. అయితే ఆ తర్వాత పోలీసులకు కాలిన మృతదేహం దొరకడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.