డేటింగ్ యాప్ ల పేరుతో అబ్బాయిలకు వల వేయడం, ఆ తర్వాత వారి వద్ద అందినకాడకి గుంజేయడం నగరాల్లో సాధారణ విషయంగా మారిపోయింది. ఎన్నిసార్లు, ఎంతమంది మోసపోయారని తెలిసినా.. ఇంకా మోసపోయేందుకు కుర్రకారు రెడీగా ఉండటం విశేషం.
వ్యభిచారం కూడా ఇప్పుడు ఆన్ లైన్ లోకి మారిపోయింది. దానికోసం ప్రత్యేకంగా డేటింగ్ యాప్ లు పుట్టుకొచ్చాయి. కేవలం ఫ్రెండ్ షిప్ పేరుతో రిజిస్టర్ అవుతాయి కాబట్టి, వీటిని నిషేధించడానికి కూడా లేదు. అయితే ఫ్రెండ్షిప్ మాటున అసాంఘిక కార్యకాలాపాలు జోరుగా సాగుతుంటాయి.
డేటింగ్ యాప్ లలో పరిచయం అయ్యేవారు గతంలో హోటల్ రూమ్ లు బుక్ చేసుకునేవారు. కానీ కరోనా కష్టకాలంలో హోటల్ రూమ్స్ కి వెళ్లే సాహసం చేయడంలేదు. నగర శివార్లలో ఉన్న అద్దె ఇళ్లను లేదా, నేరుగా ఇంటిలోనే మకాం పెట్టేస్తున్నారు.
విదేశీ యువతులు..
ఇటీవల హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ లో వ్యభిచారం చేస్తూ టాంజానియాకు చెందిన ఓ మహిళ, ఆమెకు సహకరిస్తున్న స్నేహితుడు రాచకొండ పోలీసులకు చిక్కారు. గూగుల్ ప్లేస్టోర్‌లో సుమారు 200కు పైగా డేటింగ్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఇవే ఇప్పుడు నిర్వాహకులకు వరంగా మారాయి. వీటిలో కొన్ని ఉచితం. మరికొన్నింటికి రిజిస్ట్రేషన్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత అసభ్యకరమైన ఫొటోలను నాలుగైదు యాప్ ల్లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆసక్తి చూపించిన వారితో కొన్ని రోజులు ఛాటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత మహిళలు తమ వాట్సాప్ నంబర్ ను ఇస్తారు. దీంతో యాప్ నుంచి ఛాటింగ్ వాట్సాప్ కు మారుతుంది. అవతలి వైపు వ్యక్తులు అడుగు ముందుకేసేలా వాట్సాప్ లో నగ్నంగా ఫొటోలు పంపిస్తారు. వీడియో కాల్స్ చేస్తారు. అటువైపు నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఫలానా సమయంలో.. ఫలానా దగ్గరికి రావాలంటూ లొకేషన్ షేర్ చేస్తున్నట్లు గుర్తించామని పోలీసులు పేర్కొంటున్నారు.
డేటింగ్ పేరుతో మోసాలు..
కొన్నిసార్లు నగ్న వీడియోలు చూసి యువకులు మురిసిపోయి, తాము కూడా నగ్నంగా తయారై వీడియో ఛాటింగ్ లు చేస్తుంటారు. ఇలాంటివారు మోసగాళ్ల వలకు ఈజీగా చిక్కినట్టే. ఆ వీడియోలు అడ్డు పెట్టుకుని యువకుల వద్ద అందినకాడికి గుంజేస్తుంటారు. ఈ తరహా మోసాలు కూడా ఇటీవల ఎక్కువయ్యాయి.