తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి , గవర్నర్ తమిళసై కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలను , గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఇలా చేయడాన్ని గవర్నర్ కార్యాలయం బహిరంగంగానే తప్పు పట్టింది. ఫైనాన్స్ బిల్లుని , గవర్నర్ ఆమోదించిన తరువాతనే , గవర్నర్ ప్రసంగంతో , బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం ఆనవాయితీ.. ఫైనాన్స్ బిల్లుని , తన ఆమోదంకోసం పంపేప్పుడుకూడా , గవర్నర్ ప్రసంగంతో , అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయని చెప్పారని గుర్తుచేశారు.
ప్రభుత్వం , ఆ మాటను పక్కనబెట్టి , సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చినా , ప్రజా శ్రేయస్సు దృష్ట్యా , బిల్లుని ఆమోదించి పంపానని , ఈ విషయాన్ని ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నామని గవర్నర్ కార్యాలయం తెలిపింది. ఫెడరల్ వ్యవస్థలో ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పింది. అయితే కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ వాదనను ఖండించింది.
ఇవి కొత్త సమావేశాలు కాదని , ఐదు నెలలక్రితం ఆగిపోయిన సమావేశాలకు కొనసాగింపుగా జరిగేవని , వీటిలో గవర్నర్ ప్రసంగం ఉండదని చెప్పింది. అప్పుడు సమావేశాలు ప్రోరోగ్ చేయలేదని అందువల్ల , వాటిని కొనసాగింపుగానే భావించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటున్నారు.. మొత్తానికి తెలంగాణాలో , ప్రభుత్వం , గవర్నర్ మధ్య డైరెక్ట్ వార్ మొదలయింది.. పర్యవసానం ఎలాఉంటుందో చూడాలి..