శివసేన వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం తారా స్థాయికి చేరి చివరకు కేంద్ర మంత్రి అరెస్ట్ కి దారి తీసింది. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెప్ప కొట్టేవాడినంటూ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ముంబైలో బీజేపీ కార్యాలయాలపై శివసేన దాడికి తెగబడింది. కార్యకర్తల మధ్య కర్రల యుద్ధం జరిగింది. ఈరోజు కొంకణ్ లో జన్ ఆశీర్వాద్ ర్యాలీలో పాల్గొన్న రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ ని ముందే ఊహించి రత్నగిరి కోర్టులో నారాయణ్ రాణే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అది రద్దయింది. బెయిల్ పిటిషన్ రద్దయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాణేను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.