టెన్త్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, పీజీ పరీక్షలు ఫెయిలవుతున్నా కొంతమంది పట్టువదలని విక్రమార్కుల్లా పరీక్షలు రాస్తూనే ఉంటారు, ఫెయిలవుతూనే ఉంటారు. ఇసబెల్లా స్టెడ్ మెన్ అనే 47ఏళ్ల మహిళది మరో కొత్త రకం ఫెయిల్యూర్ హిస్టరీ. 30ఏళ్లుగా ఆమె డ్రైవింగ్ లైసెన్స్ కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పటికీ వెయ్యి దఫాలు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కి పోయి ఫెయిలైంది.
దాదాపు 10వేల పౌండ్లు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖర్చు పెట్టింది. 17వ సంవత్సలంలో ప్రారంభమైన ఆమె డ్రైవింగ్ లైసెన్స్ పోరాటం, ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ప్రతి దఫా డ్రైవింగ్ లైసెన్స్ క్లాస్ లకు పోయినప్పుడు స్టీరింగ్ ముందు కూర్చుని, మూర్ఛ వచ్చినట్టు వణుకుతూ స్టీరింగ్ పై పడిపోతుంది. ఇలా 30ఏళ్లుగా జరుగుతూనే ఉంది, ఆమె డ్రైవింగ్ లైసెన్స్ కోసం పోరాటం చేస్తూనే ఉంది.
డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లేదనుకున్నప్పుడు మాత్రం కారు బాగానే తోలుతుంది. అధికారుల వద్దకు లైసెన్స్ కోసం పోయినప్పుడే, టెస్ట్ డ్రైవ్ కి వెళ్లినప్పుడే శరీరంలో వణుకు మొదలై, స్టీరింగ్ పైనే మూర్ఛ పోతుంది. దీంతో లైసెన్స్ కోసం ఆమె పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. డాక్టర్లు మాత్రం ఆమె అత్యుత్సాహం, ఆ సమయంలో లైసెన్స్ తెచ్చుకోవాలన్న తాపత్రయం, ఆతృత వల్లే ఇలా అవుతుందని, ఆమె ఆరోగ్యంగానే ఉందని చెప్పారు.
ఇసబెల్లా మాదిరిగానే పోలెండ్ కి చెందిన 50ఏళ్ల వ్యక్తి 192 సార్లు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కి హాజరై పాస్ కాలేకపోయారు. పిట్రోకో నుంచి మరో వ్యక్తి, 220 సార్లు డ్రైవింగ్ లైసెన్స్ కి పోయి పాస్ కాలేకపోయారు. వీరంతా లైసెన్స్ కి పోనప్పుడు బాగానే డ్రైవ్ చేస్తారు.