మెడికల్ కాలేజీల్లో కేంద్రం ఏర్పాటు చేసిన నీట్ పై తమిళనాడు ప్రభుత్వం తిరగబడింది. మొదటి నుంచి నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు రాష్ట్రం, ఈరోజు ఏకంగా అసెంబ్లీలోనే బిల్లు ఆమోదించింది. మెడికల్ డిగ్రీ కోర్సులకు నీట్ ప్రాతిపదికగా అడ్మిషన్లు వద్దంటూ బిల్లులో పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలకు ఇక నుంచి ప్లస్ టూలో మార్కుల ఆధారంగానే సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు. బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ఈ బిల్లును సమర్ధించాయి. అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ బిల్లు, రాష్ట్రపతి ఆమోదం పొందితేనే అమలులోకి వస్తుంది.
నీట్ పై అధ్యయనం చేసేందుకు కోచింగ్ సెంటర్ల పేరుతో విద్యార్ధులను దోచుకుంటున్న విధానంపైన తమిళనాడు ముఖ్యమంత్రి ఒక కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నీట్ విధానం వల్ల అర్హులైన విద్యార్ధులు సీట్లు పొందలేక పోతున్నారని, డబ్బులున్న పిల్లలు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి సీట్లు సంపాదించుకుంటున్నారని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్ధులు నష్టపోతున్నారు. నీట్ పరీక్షలో పాస్ కాలేనేమో అనే భయంతో తమిళనాడు రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ళ ధనుష్ అనే విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వం నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదముద్ర వేసింది.