మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత చిన్నగా దారికొచ్చింది. ఎట్టకేలకు మధ్యవర్తుల ప్రమేయంతో సుచరిత .. ముఖ్యమంత్రి జగన్ ని కలిసిన తర్వాత మాట మార్చేసింది. తాను అనారోగ్య, వ్యక్తిగత కారణాలతో మంత్రివర్గంలో కొనసాగలేనని, థ్యాంక్స్ చెబుతూ లేఖ రాస్తే… తాను రాజీనామా చేస్తున్నట్లు వార్తలొచ్చాయని ఆమె చెప్పింది. పదవి ఆశించినా. రాకపోవడంతో కొంత ఉద్వేగానికి గురయ్యానని అన్నారు. తనపై వస్తున్న నిరాధార వార్తలను నిలిపేయాలని కోరింది.
తాను వైసీపీ పార్టీలోనే ఉంటానని, జగన్ కి విధేయురాలిగానే ఉంటానని చెప్పింది. 2006లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానన్న ఆమె.. జడ్పీటీసీ మొదలు హోమంత్రి వరకు జగన్ సారధ్యంలో ఎదిగానని చెప్పుకొచ్చింది. ఇదిలావుండగా మంత్రి పదవులు ఆశించిన మరికొంతమంది ఎమ్మెల్యేలు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మరో ఎమ్మెల్యే బాబూరావు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. కేబినెట్ లో పాత ఎస్సీ మంత్రులను కొనసాగించి, సుచరితను మాత్రం పక్కన పెట్టారనే బాధతో ఆమె ఉన్నట్లు రాజకీయవర్గాల మాట.