కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెత చాలా దఫాలు నిరూపితం అవుతూనే ఉంటుంది . ఇండోర్ లో ఓ పేద కుటుంబంలో పుట్టిన అంకిత అనే యువతి సివిల్ జడ్జి గా ఎంపికైంది . అంకిత తల్లి ,తండ్రి తోపుడు బండి పైన కూరగాయల అమ్ముతూ ఉంటారు . తమ్ముడు మార్కెట్లో కూలీగా ఉంటాడు . కాలేజీ సెలవు రోజుల్లో అంకిత కూడా తన తల్లిదండ్రులకు తోడుగా తోపుడు బండి తీసుకుని కూరగాయలు అమ్మేందుకు పోతుంది. అంత కష్టపడి చదివిన ఇప్పుడు సివిల్ జడ్జి గా ఎంపికైంది.
న్యాయమూర్తుల ఎంపిక కోసం పెట్టిన పరీక్షలో ఆమెకు ఐదో ర్యాంకు వచ్చింది . ఈ పరీక్ష ఫలితాలు రెండు రోజుల క్రితమే వచ్చాయి. తన తల్లి ,తండ్రి కష్టపడి చదివించారని , తన సోదరుడు కూలీ పనిచేసి ఇల్లు గడిపేవాడని అని అంకిత చెబుతోంది . తన తండ్రి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే లేచి తోపుడు బండి తీసుకొని వీధుల్లో కూరగాయలు అమ్మేవాడని , ఎనిమిది గంటలకి తన తల్లి తనని కాలేజీకి పంపినతరువాత తోపుడు బండి మీద కూరగాయలు అమ్మెందుకు వెళ్లేదని చెప్పింది. సెలవు రోజుల్లో తల్లి బదులు తానే కూరగాయలు వీధుల్లో అమ్మేదానినని చెప్పింది.. తమ మధ్యలోనే ఉన్న కూలీ బిడ్డ , జడ్జి కావడంతో , ఆ కాలనీలో కూలీలంతా సంబరం చేసుకున్నారు..