జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని 120 కిలోమీటర్లకు పెంచుతూ మూడేళ్ల క్రితం కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు పక్కనపెట్టింది. దీన్ని రద్దు చేస్తున్నట్టుగా భావించి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ తిరుంబకరన్, టీవీ తంబి సెల్వి ఆదేశించారు. దీనిపై కేంద్రం ఇచ్చిన సమాధానంతో మద్రాస్ హైకోర్టు సంతృప్తి చెందలేదు. వాహనాల ఇంజిన్లు, సాంకేతికత, రోడ్ల నిర్మాణంలో గణనీయమైన ఆధునికత మెరుగుదల ఉండటంతో వాహనాల వేగాన్ని 120 కిలోమీటర్లకు పెంచామని కేంద్రం చెప్పింది. అయితే కేంద్రం వాదనతో హైకోర్టు బెంచ్ విభేదించింది. వాహనాల ఇంజిన్లో సాంకేతికత అధునాతనమైనదే అయినా రోడ్ల నిర్మాణంలో నాణ్యత పెరిగినా, రోడ్ల వెడల్పు పెరిగినా, రోడ్డు భద్రతా ప్రమాణాలు అమలులో పూర్తిగా వైఫల్యం కనిపిస్తోందని అభిప్రాయపడింది.
దీనికి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలే నిదర్శనం అని కూడా ఎత్తి చూపింది. ఉపరితల రవాణా శాఖ, జాతీయ రహదారుల శాఖ ఇచ్చిన ప్రమాదాల్లో మరణాల సంఖ్య గతంలో కంటే గణనీయంగా పెరిగిందని, ఇది కేవలం వాహనాల అతివేగం, భద్రతా ప్రమాణాలు పాటించడంలో డ్రైవింగ్ సీట్లో ఉన్నవారి నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని కూడా అభిప్రాయపడింది. ఇంజిన్ టెక్నాలజీ స్పీడ్ పెంచేందుకే ఉపయోగపడిందే తప్ప, జాతీయ రహదారులపై ప్రమాదాలను తగ్గించేందుకు ఏమాత్రం ఉపయోగపడలేదని, ప్రమాదాల్లో మరణాల సంఖ్యను మరింత పెంచిందని కూడా అభిప్రాయపడ్డారు. అందువల్ల మొదట భద్రతా ప్రమాణాలను పాటించే విషయంలో అందరికీ అవగాహన కల్పించిన తర్వాత దానికి సరైన నిబంధనలు రూపొందించిన తర్వాత వాహనాల వేగం పెంచుకోవచ్చని కూడా అభిప్రాయ పడింది.