నాగచైతన్యతో విడాకుల తర్వాత తాను ఎంత గట్టిదాన్నో తనకు తెలిసొచ్చిందని హీరోయిన్ సమంత చెప్పింది. విడాకుల తర్వాత తొలిసారిగా ఆమె ఈ విషయంపై ఓ ఇంటర్వూలో స్పందించింది. డైవర్స్ తర్వాత తాను కూలిపోతానని, కుమిలిపోతానని, చచ్చిపోతానని కూడా అనుకున్నానని.. అయితే తాను ఇంత బలంగా ఉంటానని ఊహించలేదని, ఇందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని, ఆమె ఫిల్మ్ ఫేర్ కి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పింది. చెడు రోజులు చాలామందికి వస్తాయని, దాన్ని అర్ధం చేసుకుని ఎదిరించి నిలబడగలిగితే జీవితంలో వదిలేసిన మిగిలిన పనిని పూర్తి చేసుకుని ఆ అపజయం నుంచి విజయం సాధించవచ్చని చెప్పింది.
ఇది నిరంతరం సాగే యుద్ధమని, జరిగినదాన్ని అది నా సమస్యే కదా అనుకుంటే… అసలు సమస్యే లేదని, మిగిలిన జీవితాన్ని అర్ధవంతంగా జీవించాలన్నారు. ఇప్పటికీ సమస్యలతో జీవిస్తున్నానని, వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలున్నాయని.. అయినా అన్నింటినీ ఎదుర్కొంటూ తాను బలహీనురాలిని కానని, బలమైనదానినని ఇన్నాళ్ళకు అర్ధమైందన్నారు. తానింత బలంగా నిలబడడానికి కారణం తన ఆత్మస్ధైర్యమేనని, అందుకు తాను గర్విస్తున్నట్లు చెప్పారు.