ప్రతిఫలం ఆశించకుండా పని చెయ్యి. ఏదో ఒకరోజు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అనేది భగవగ్దీతలో శ్రీకుష్ణుడు చెప్పిన మాట. ఓ రిక్షా కార్మికుడి జీవితంలో ఇది అక్షరాలా నిజమైంది. రిక్షా బండి లాక్కునే వ్యక్తి ఇప్పుడు ఏకంగా కోటీశ్వరుడు అయ్యాడు. ఫలితం ఆశించకుండా చేసిన పనే, ఆయనను కోటీశ్వరుడిని చేసింది. వివరాల్లోకి వెళితే…
ఒరిస్సాలోని సంబల్ పూర్ లో మినాతి పట్నాయక్ అనే వృద్దురాలు ఉంటోంది. భర్త చనిపోవడం, కొన్నాళ్ళకు కూతురు అగ్నిప్రమాదంలో చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను ఎవరూ గుర్తించలేదు. ఆమె బాగోగులుపట్టించుకోలేదు. కనీసం తోడబుట్టిన వాళ్ళు కూడా ఆమె దగ్గరకు రాలేదు. ఇటీవల ఒక్కసారిగా ఆమెపై ప్రేమ పుట్టుకొచ్చేసింది. అంతులేని ప్రేమాభిమానులు కురిపించేస్తున్నారు. అప్పటికే ఆమె సినిమా అర్దమైపోయింది. భర్త, కూతురు లేకపోవడంతో తనకు ఉన్న ఆస్తిని కాజేసేందుకు కపట ప్రేమను ఒలకబోస్తున్నారని గుర్తించింది. మరో ఆలోచన లేకుండా తనకు ఉన్న ఆస్తిని ఓ రిక్షా కార్మికుడికి రాసేసింది.
ఆ రిక్షా కార్మికుడి పేరు సామల్. ఎన్నో ఏళ్ళ నుంచి మినాతి పట్నాయక్ కుటుంబంతో పరిచయం ఉంది. ఆమె కుమార్తెను చిన్నప్పటి నుంచి స్కూల్ కి తీసుకెళ్ళేవాడు. వారికి ఏ పనులు కావాలన్నా చేసి పెట్టేవాడు. భర్త, కుమార్తె దూరమై, ఒంటరిగా జీవిస్తున్న సమయంలో ఆమెకు సామల్, అతని భార్య, కుటుంబం తోడుగా నిలిచారు. ఏ ప్రతిఫలం ఆశించకుండా ఆ వృద్దురాలికి సేవలు చేశారు. జాగ్రత్తగా చూసుకున్నారు. విశ్వాసంతో పని చేశారు. దీంతో కపట ప్రేమ చూపించే బంధువుల కన్నా, నిస్వార్ధంగా సేవలు చేసిన సామల్ కుటుంబానికి తన ఆస్తులను రాసిచ్చేసింది. అతనిపై రిజిస్ట్రేషన్ కూడా చేయించింది. మినత్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.