రోజూ జిమ్ కి వెళ్లి వ్యాయామం చేయడం చాలామందికి అలవాటు. అయితే కరోనా టైమ్ లో జిమ్ లు మూతబడటంతో ఆ అలవాటు తప్పింది. ఇంట్లోనే జిమ్ ఎక్విప్ మెంట్ పెట్టుకున్నవారికి ఇబ్బంది లేదు. ఇప్పుడిప్పుడే కరోనా తర్వాత పరిస్థితి తిరిగి మామూలుగా మారడంతో జిమ్ లతోపాటు అన్నిటికీ అనుమతులొచ్చాయి. అయితే జిమ్ కి వెళ్లే అలవాటు ఉన్నవారు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
జిమ్ లేదా ఇతర ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు గుండెపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా జిమ్, రన్నింగ్, జాగింగ్ వంటివి చేసినప్పుడు గుండె వేగం, బీపీ పెరుగుతాయి. జిమ్ లో మోతాదుకు మించి కసరత్తు చేయడం వల్ల ‘హార్ట్‌బీట్ రిథమ్ డిస్టబ్’ అవుతుంది.
హార్ట్‌బీట్‌లో మార్పులు
ఆరోగ్యవంతుల్లో సాధారణ హార్ట్‌బీట్ అనేది 60 నుంచి 90 మధ్యలో ఉంటుంది. జిమ్ లేదా ఇతర వ్యాయామాలు చేసినప్పుడు హార్ట్‌బీట్ అనేది పెరగడం సహజం. ఇలాంటి సమయాల్లో గుండె వేగం అనేది 120 నుంచి 140 వరకు వెళ్తుంది. వ్యాయామం తరువాత 3 నిమిషాల్లో తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటుంది. వ్యాయామం చేసినప్పుడు హార్ట్‌బీట్ అనేది 140 దాటినా లేక వ్యాయామం తరువాత 3 నిమిషాల్లో హార్ట్‌బీట్ సాధారణ స్థాయికి చేరకపోయినా సదరు వ్యక్తికి గుండె సమస్యలున్నట్టు అనుమానించాలి. సామర్థ్యానికి మించి తీవ్రమైన వ్యాయామం చేస్తే హార్ట్‌బీట్ 140 దాటి ఒక్కసారిగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వ్యాయామం చేసే ముందు వామప్, వ్యాయామం పూర్తైన తరువాత కూల్‌డౌన్ ఎక్సర్‌సైజ్‌లు తప్పనిసరి. వార్మప్.. అంటే శరీరాన్ని నెమ్మదిగా వేడెక్కించడం. ఇది చేయకుండా నేరుగా వ్యాయామం చేస్తే శరీరం ఉన్నట్లుండి ఒక్కసారిగా వేడెక్కితే అది విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ఇక వ్యాయామం ముగిసిన తరువాత చాలా మంది టైమ్ అయిపోయిందని లేదా అర్జంటుగా వెళ్ళాలని వెంటనే జిమ్ నుంచి వెళ్లిపోతారు. ఇది ప్రమాదకరం. వ్యాయామంతో వేడెక్కిన శరీరాన్ని నెమ్మదిగా చల్లబర్చాలి. అందుకోసం కూల్‌డౌన్ ఎక్సర్‌సైజ్ తప్పనిసరి.