సాహసానికి మారుపేరు మల్లి మస్తాన్ బాబు..

  0
  182

  మల్లి మస్తాన్ బాబు. ఆయన మరణించే వరకు నెల్లూరు జిల్లావాసులకి కూడా ఆయన ప్రతిభ అంతగా తెలియదు. కానీ మరణం తర్వాత గొప్పవాడయ్యాడు మస్తాన్ బాబు. అర్జెంటీనాలోని ‘సెర్రో ట్రెస్‌ క్రూసెస్‌ సుర్‌’ మంచు పర్వతాన్ని అధిరోహిస్తూ 2015న సరిగ్గా ఇదే రోజు (మార్చి-23) మరణించాడు.

  మస్తాన్‌ బాబు స్వస్థలం నెల్లూరు జిల్లా గాంధీ జన సంగం. తల్లిదండ్రులు సుబ్బమ్మ, మస్తానయ్య. 1974 లో జన్మించిన మస్తాన్ బాబు. స్థానికంగా ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి 1985 లో కోరుకొండ సైనిక పాఠశాలలో 6వ తరగతిలో చేరాడు. ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు (1985-92) విజయనగరం జిల్లాలోని కొరుకొండ సైనిక పాఠశాలలో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. ఆర్వాత జంషెడ్ పూర్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఖరగ్‌ పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశాడు. 1998నుండి 2001 వరకు సత్యం కంప్యూటర్స్ లో పనిచేసి.. తన ఉద్యోగాన్ని వదిలి పర్వతారోహణను ప్రవృత్తిగా మార్చుకున్నాడు.

  చిన్నప్పటినుంచే పర్వతారోహణపై ఆసక్తి ఉన్న మస్తాన్ బాబు.. ఉద్యోగాన్ని వదిలిన తర్వాత దానిపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాడు. సంగం కొండ మొదలు ఎవరెస్ట్ వరకు పర్వతాలని తన పాదాక్రాంతం చేసుకున్నాడు. 2006లో ప్రపంచంలోని వివిధ దేశాలలోని ఏడు ఎతైన, పర్వతశిఖరాలను 172 రోజుల కాలంలో అధిరోహించి రికార్డ్ సృష్టించాడు.


  విన్సన్‌మానిఫ్‌ (అంటార్కిటికా), అకోన్‌ కగువా (దక్షిణ అమెరికా), కిలిమంజరో (ఆఫ్రికా), కోస్‌ కుయిజ్‌ కో (ఆస్ట్రేలియా), ఎవరెస్టు (ఆసియా), ఎల్‌బ్రస్‌ (ఐరోపా), డెనాలి (ఉత్తర అమెరికా).. లను తన పాదాక్రాంతం చేసుకున్నాడు. చిలీ, అర్జెంటీనా దేశ సరిహద్దుల్లో ఉన్న ఓజోస్‌ డెల్‌ సాలాడో అనే 6893మీటర్ల ఎత్తువున్న అగ్నిపర్వతాన్ని కూడా మస్తాన్ బాబు అధిరోహించాడు. రష్యాలోని మౌంట్ ఎల్‌ బ్రూస్ ని మూడుసార్లు అధిరోహించి రికార్డ్ సృష్టించాడు.

  2015 మార్చి 22న ఆండీస్‌ పర్వతశ్రేణి ఎక్కేందుకు నలుగురు సభ్యుల బృందంతో కలిసి వెళ్లాడు మస్తాన్ బాబు. చిలీలో రెండో అత్యంత పెద్దదైన సెర్రో ట్రెస్‌ (6749 మీటర్లు) ను ఒంటరిగా అధిరోహించేందుకు బేస్‌ క్యాంప్‌ నుంచి బయలుదేరాడు. చివరగా మార్చి 23న మస్తాన్‌ బాబు తన స్నేహితులతో మాట్లాడాడు. వాతావరణం ప్రమాదకరంగా మారడంతో పర్వతారోహణ చేస్తూ ఆయన చనిపోయాడు.

  అప్పట్లో మస్తాన్ బాబు అంత్య క్రియలను ఘనంగా నిర్వహించింది ప్రభుత్వం. ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకంలో కూడా పొందుపరిచారు. అయితే ఆయన పేరుతో ఏర్పాటు చేయాలనుకున్న స్మారకం మాత్రం ఇంతవరకు మొదలు కాలేదు. స్మారకం ఏర్పాటు చేస్తామన్న నేతలు, ఆ మాట మరచినా నెల్లూరు జిల్లా వాసులకు మాత్రం మస్తాన్ బాబు ఓ గర్వకారణం.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..