పేదవాడికి వినోదం అందని ద్రాక్ష కాకూడదంటూ సినిమా టికెట్ రేట్లను తగ్గించిన ఏపీ ప్రభుత్వం, ఇప్పుడు వాటిని మళ్లీ యథా స్థానానికి చేర్చింది. ఏపీలో హయ్యస్ట్ టికెట్ రేట్ 250 రూపాయలకి చేరుకుంది. దానికి జీఎస్టీ అదనం కావడంతో టికెట్ రేట్ మరింత కాస్ట్ లీ గా మారే అవకాశముంది.
వాస్తవానికి చిరంజీవి బృందం సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత వెంటనే శుభవార్త వింటారని ఇరు వర్గాలు చెప్పాయి. కానీ రోజులు గడిచినా శుభవార్త రాలేదు. దీంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి సినిమాలను వెనక్కు పంపించారు. అయితే పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మాత్రం కరోనా ఆంక్షల తర్వాత ముందుగా రిలీజైంది. ఈ సినిమా విడుదల సమయంలో టికెట్ రేట్లు సవరిస్తారని, ఐదో షో కి అనుమతిస్తారని అనుకున్నారు. కానీ అది జరగలేదు సరికదా.. సినిమా థియేటర్ల వద్ద రెవెన్యూ, పోలీసుల హడావిడి ఎక్కువైంది. దీంతో భీమ్లా నాయక్ పై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందనే విమర్శలు వినిపించాయి.
సరిగ్గా ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా విడుదల టైమ్ లో టికెట్ రేట్లను సవరించిన జీవో ఇచ్చారు. దీని ప్రకారం సినిమా టికెట్ రేట్లు పెరిగాయి. ఐదో షో కి అనుమతి కూడా వచ్చింది. జీవో విడుదలకు కొన్ని గంటల ముందే ప్రభాస్ దీనిపై స్పందించడం విశేషం. టికెట్ రేట్లు పెంచుకునే జీవో వస్తే తనకి సంతోషం అన్నారాయన. ఆయన ఆ మాట చెప్పిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం జీవోని విడుదల చేసింది. ఇంకేముంది జనసైనికులు మరోసారి సోషల్ మీడియాలో జగన్ ని టార్గెట్ చేశారు.
భీమ్లా నాయక్ కి టికెట్ రేట్లు తగ్గించి అన్యాయం చేశారని, ఇప్పుడు రాధేశ్యామ్ కి టికెట్ రేట్లు పెంచి కావాలని పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేశారని అంటున్నారు. మొత్తమ్మీద సినిమా టికెట్ రేట్ల తగ్గింపుతో భీమ్లా నిర్మాతలు నష్టపోగా.. కొత్త జీవో వల్ల రాధేశ్యామ్ సినీ నిర్మాతలు మాత్రం లాభపడతారనడంలో ఎలాంటి అనుమానం లేదు.