ఇప్పుడు విద్యార్ధులు ఒకేదఫా రెండు డిగ్రీలు చదువుకునే అవకాశాన్ని యుజీసీ కల్పించింది. ఇప్పటివరకు మనదేశంలో ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదివే అవకాశం లేదు. అలాచేస్తే ఏదో ఒక డిగ్రీని ఖచ్చితంగా రద్దు చేసుకోవాల్సిందే. లేదంటే రెండు డిగ్రీలు పనికి రాకుండా పోతాయి. అయితే ఇప్పుడు డిప్లమా, డిగ్రీ, పీజీ కోర్సులు ఒకే సమయంలో రెండు చదువుకోవచ్చు. దీనికి యుజీసీ అనుమతిచ్చింది.
ఒకటి రెగ్యులర్ విధానంలో, మరొకటి ఆన్ లైన్ విధానంలో. ఇలా ఏవిధంగానైనా రెండు డిగ్రీలు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. రెగ్యులర్ డిగ్రీ చేసుకుంటూనే ఆన్ లైన్ లోనే డిగ్రీ లేదా పీజీ లేదా డిప్లమా చేసే అవకాశాన్ని అందించింది. ఈ రెండింటికీ గుర్తింపునిస్తుంది. డిగ్రీ చదువుతూ డిప్లమా కూడా చదువుకోవచ్చు. పీజీ చేస్తూ మరొక డిగ్రీ కోర్సు చేయాలనుకుంటే రెండూ చదువుకోవచ్చు. ఉదాహరణకు ఎమ్మెస్సీ చదివేవాళ్ళు బీఏ డిగ్రీ చదవాలనుకుంటే ఆ కోర్సు కూడా చేరచ్చు.
ఇలాంటి అవకాశం భారతదేశంలో తొలిసారి కల్పించారు. ఫార్మల్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫిజికల్ మరియు ఆన్ లైన్ విధానంలో విద్యార్ధులు తమకు నచ్చిన కోర్సులను చేసుకునే అవకాశం ఇంతకాలానికి వచ్చింది. దీనివల్ల విద్యార్ధులకు వివిధ రంగాల్లో విజ్ఞానం పెరుగుతుందని చెబుతున్నారు. ఒకేదఫా రెండు డిగ్రీలు, పీజీలు, లేదా డిప్లమాలు రెగ్యులర్ గా చదవాలనుకుంటే టైమింగ్స్ చూసుకోవాల్సిన బాధ్యత విద్యార్ధులదే. ఎంఫిల్, పీహెచ్‌డీ లకు ఇది వీలు కాదు.