సినిమా విడుదలైన తర్వాత విజయవంతంగా ప్రదర్శిస్తుంటే.. ఒక్కోపాట రెండుసార్లు అంటూ ప్రచారం చేసేవారు గతంలో. కానీ ఇప్పుడు సినిమా విడుదలై రెండో వారంలో ప్రవేశించిన తర్వాత ఇదిగో కొత్తపాట అంటూ బయటపెడుతున్నారు నిర్మాతలు. సర్కారువారి పాట కోసం కొత్త సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. దీన్ని నేరుగా థియేటర్లలో ప్రదర్శిస్తారు.
డివైడ్ టాక్ రావడంతో సినిమాకి కలెక్షన్స్ గ్రాఫ్ పడిపోకుండా చూసుకోవడానికి టీమ్ పక్కా ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తోంది. కర్నూలులో పెట్టిన సక్సెస్ మీట్ లో మహేష్ బాబు కూడా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేశారు. నిజానికి మహేష్ బాబు ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటారు. కానీ ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. రెండు రోజులుగా సినిమాకి సంబంధించిన ప్రోమోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు మురారి బావ అంటూ సాగే కొత్త పాటను యాడ్ చేస్తున్నారు.
మ.. మ.. మహేషా అనే పాట ఎంత పాపులర్ అయిందో మురారి బావ అనే పాట కూడా అంత పాపులర్ అవుతుందని అంటున్నారు. దీనిపై గతంలో చిన్న హింట్ కూడా ఇవ్వని చిత్ర యూనిట్.. ఇప్పుడు ఏకంగా పాటని థియేటర్లలో వదిలిపెట్టబోతోంది.