దసరా ఉత్సవాలకు మైసూర్ ప్యాలస్ ముస్తాబయింది. మైసూరులో జరిగే దసరా ఉత్సవాలు కర్ణాటక రాష్ట్ర పండుగ నదహబ్బను.. విజయదశమితో కలిపి పదిరోజులు వరుసగా జరుపుకుంటారు. ఎక్కువగా దసరా పండుగ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వస్తుంది. హిందూ పురాణాలను అనుసరించి విజయదశమి చెడుపై మంచి విజయానికి సంకేతంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులు వివిధ అవతారాల్లో మహిషాసురుని సేనలను నాశనం చేసిన పరాశక్తి, తొమ్మిదోరోజున మహిషాసురుణ్ణి సంహరించింది. ఈ విజయానికి సూచనగా ఆ తరువాతి రోజు విజయదశమిగా పండుగ జరుపుకుంటారు.
మైసూరులోని అమ్మవారి పేరు చాముండేశ్వరీదేవి. మైసూరు దసరా ఉత్సవాలకు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ పదిరోజులు జరిగే, పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులు దేశంలోని పర్యాటకులనే కాక, విదేశీయులనూ ఆకట్టుకోవడం విశేషం. ఈ ఉత్సవాలు చూసేందుకు ప్రతీ ఏడూ లక్షల సంఖ్యలో పర్యాటకులు మైసూరు వస్తూంటారు. ఈ ఉత్సవాలు మొదలుపెట్టి 410 ఏళ్ళు పూర్తయ్యాయి. 15వ శతాబ్దంలో విజయనగర రాజులు దసరా ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు.
విజయనగర సామ్రాజ్య పతనం తరువాత మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గర్లో ఉన్న శ్రీరంగపట్నంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. తొలి రాజా ఉడయార్ 1610లో ఈ ఉత్సవాలను మొదలుపెట్టారు. ఈ పదిరోజులూ మైసూరు ప్యాలెస్, చాముండీ కొండ దీప కాంతుల్లో వెలిగిపోతుంది. ఈ రెండిటినీ చూడటనాకి పర్యాటకులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. 1805లో మూడవ తరం కృష్ణరాజ ఉడయార్ ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దసరా సమయంలో మైసూరు ప్యాలస్ లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ తరువాత అది ఆచారంగా మారిపోయింది. ఈ దర్బారులో రాజబంధువులు, రాజకుటుంబాలు, అతిథులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొంటారు. 2013 డిసెంబరులో శ్రీకంఠ ఉడయారు చనిపోయేంతవరకూ ఈ ఆచారం కొనసాగుతూ వచ్చింది. కానీ ఆయన మరణానంతరం బంగారపు రాజసింహాసనంపై, రాచఖడ్గం అయిన “పట్టడ కత్తి”ని ఉంచి ఈ దర్బారు నిర్వహిస్తున్నారు.
నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన మహర్నవమి నాడు ఈ రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి, పూజలు చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే ఐదు ఏనుగులు మైసూర్ రాజభవనంలోనికి తీసుకొచ్చారు. కరోనా కారణంగా గత ఏడాది ఈ దసరా ఉత్సవాలను పెద్దగా జరపలేదు. అయితే ఈ సంవత్సరం దసరా ఉత్సవాలను వేడుకగా నిర్వహించేందుకు రాజకుటుంబీకులు సిద్ధమవుతున్నారు.
Gajapayana – Mysuru Dasara 2021 ..
Aranya bhavana to Mysuru palace lead by Ambaari elephant AbhimanyuVC : Manoranjan pic.twitter.com/SvmuR6b9VK
— Mysuru Memes (@MysuruMemes) September 16, 2021
ఇవీ చదవండి..