దోమలు దొంగను పోలీసులకు పట్టించాయంటే నమ్ముతారా ? అందులోనూ చచ్చిన దోమలు. నమ్ముతారా ? అవును, ఎవరూ నమ్మలేరు. కానీ ఇది నిజం… చచ్చిన రెండు దోమలు ఓ దొంగను నిజంగానే పట్టించాయి. వినడానికి వింతగా కట్టుకధగా ఉన్నా ఇది ఖచ్చితంగా నిజమే. చైనాదేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చైనాలోని ఫుజాన్ అనే ప్రాంతంలోని ఓ అపార్టుమెంటులో చోరీ జరిగింది. కొత్తగా నిర్మించిన ఆ అపార్టుమెంటులోని ఓ ఫ్లాట్‌లో చాయ్ అనే దొంగ చొరడ్డాడు. నగదు, నట్రా, విలువైన వస్తువులను దోచేశాడు. చోరీకి ముందు వంటగదిలోకి వెళ్ళి ఎగ్ నూడిల్స్ కూడా చేసుకున్నాడు. ఫుల్లుగా తిన్నాడో ఏమో గానీ కునుకు పట్టేసింది. ఇంకేముందు మస్కిటో కాయిల్ వెలిగించుకుని బెడ్ మీద ఎంచక్కా పడుకున్నాడు. కాసేపటికి మెలకువ రావడంతో.. దోచుకున్నవన్నీ సర్దుకుని ఫ్లాట్ నుంచి బయటకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఫ్లాట్ ఓనరు వచ్చి చూడగా… దొంగతనం జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
రంగంలోకి దిగిన పోలీసులకు ఎక్కడా ఏ ఆనవాలు దొరకలేదు. చివరికి బెడ్ మీద చచ్చిన రెండు దోమలు కనిపించాయి. ఆ చచ్చిన దోమలను, పక్కనే ఉన్న రెండు బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి ఫోరెన్సిక్ కి పంపించారు. ఇక్కడే ట్విస్ట్ జరిగింది. చచ్చిన ఆ రెండు దోమలు పోలీసులకు పెద్ద క్లూ ఇచ్చాయి. తిని బెడ్ మీద నిద్ర పోయిన దొంగను ఆ రెండు దోమలు కుట్టాయి. దీంతో అతను ఆ రెండు దోమలను కొట్టి చంపేశాడు. ఆ దొంగ శరీరం నుంచి ఆ రెండు దోమలు పీల్చిన రక్త నమూనాను తీసుకుని డీఎన్ఏ టెస్ట్ చేయించారు పోలీసులు. ఇంకేముందు ఆ డీఎన్ఏ టెస్టులో అసలు దొంగ ఎవరో కనిపెట్టేశారు. ఇంక ఆలస్యం చేయకుండా దొంగను కూడా వెంటనే పట్టేసుకున్నారు. దొంగను విచారించగా.. తాను దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు. 19 రోజుల తర్వాత చాయ్ అనే దొంగను చచ్చిన ఆ రెండు దోమలు పట్టించాయన్నమాట. సో.. ఇప్పటికైనా నమ్ముతారా ?