ఛీ… ఇదేం బతుకురా.. కుక్క బతుకు. అని జీవితంలో ఏదో ఒక సందర్భంలో అంటాం. లేదా మనసులోనైనా అనుకుంటూ ఉంటాం. కానీ వీడిది మాత్రం నిజంగా కుక్క బతుకే. ఎందుకంటే వీడు కుక్క లాగే బతకాలనుకుంటున్నాడు. అలాగే బతుకుతున్నాడు కూడా. నమ్మకపోయినా ఇది మాత్రం నిజం.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది పెట్స్ పెంచుకుంటూ ఉంటారు. వాటిలో ఎక్కువగా పెంచుకునేది మాత్రం కుక్కనే. కుటుంబంలోని సభ్యులుగా కుక్కలను ప్రేమగా చూసుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ జపాన్ లోని టోకో అనే వ్యక్తి మాత్రం కుక్కలను పెంచుకోడు.
తానే కుక్కలా మారిపోయాడు. మనుషి జీవితం వదిలేసి.. శునక జీవితానికి అలవాటు పడిపోయాడు. కుక్క లాగా మొరగడం, కుక్కలాగా తినడం, కుక్కలాగా ప్రవర్తించడం చేస్తున్నాడు. వినడానికి వింతగా, చూడడానికి కొత్తగా ఉన్నా ఇది మాత్రం పచ్చి నిజం. కుక్కలాగా బతకడానికి కుక్క మాదిరి డ్రెస్ కూడా చేయించుకున్నాడు.
స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టి చేయించుకున్న ఈ డ్రెస్సు వేసుకుంటే అచ్చం కుక్కలాగే కనిపిస్తారు. ఈ డ్రెస్ వేసుకుని టోకో ఇంట్లో, వాకిట్లో, బయట తిరుగుతుండడం విశేషం. ఈ స్పెషల్ డ్రెస్ కోసం ఏకంగా 12 లక్షలు ఖర్చు చేశాడు టోకో. పిచ్చితనమో … వెర్రితనమో… తెలియదు కానీ టోకో మాత్రం కుక్క అవతారమెత్తి ఫేమస్ అయిపోయాడు.