ఇటీవలికాలంలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలిపోవడం… వాటి కారణంగా కొంతమంది చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులో తల్లికూతుళ్ళు ఇంటిలో నిద్రిస్తుండగా చార్జింగ్ లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ తగలబడి.. ఆ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలే పూణె, గుజరాత్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లోనూ చోటుచేసుకున్నాయి.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ పట్టణంలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిపోవడంతో… ఓ యువకుడు మృతి చెందాడు. మంగళవారం రాత్రి సుభాష్ నగర్‌లో రామకృష్ణ అనే వ్యక్తి తన ఎలక్ట్రిక్ బైక్ కి చార్జింగ్ పెట్టి నిద్రపోయాడు. అయితే కొంతసేపటికి బ్యాటరీ పేలిపోవడంతో ఆ ప్రమాదంలో రామకృష్ణ మృతిచెందాడు. ఆ ఇంట్లోని మరో ముగ్గురు కమలమ్మ, కృష్ణవేణి, కళ్యాణ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.