సైకిల్ పై వచ్చిన జొమాటో డెలివరీ బాయ్..
24 గంటల్లో కొత్త బండి కొనిచ్చిన నెటిజన్లు..
సోషల్ మీడియా తలచుకుంటే ఏమైనా చేయగలదని మరోసారి నిరూపితమైంది. ఎంతటి సమస్య అయినా సరే క్షణాల్లో తీరిపోతుందని.. తాజాగా రుజువైంది. సోషల్ మీడియా సాయంతో రాజస్థాన్ లో ఓ జొమాటో బాయ్ కష్టాలు తీరిపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఆదిత్య శర్మ అనే యువకుడు రాజస్థాన్ లో ఉంటున్నాడు. అతడు నిన్న జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేయగా.. ఫుడ్ డెలివరీ చేసేందుకు ఓ వ్యక్తి సైకిల్ పై రావడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతటి ఎండలో సైకిల్ పై వచ్చి, తనకు డెలివరీ సకాలంలో ఇవ్వడంపై డెలివరీ బాయ్ ను అభినందించాడు.
డెలివరీ బాయ్ ని మరిన్ని వివరాలు అడగడంతో.. అతను తనపేరు దుర్గా మీనా అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో టీచర్ గా పనిచేసేవాడినని.. కరోనా సమయంలో తన ఉద్యోగం పోవడంతో ఇలా జొమాటోలో చేరి డెలివరీలు చేస్తున్నట్టు చెప్పారు. నెలకు కేవలం పదివేలు మాత్రమే వస్తున్నాయంటూ తన కష్టాలు చెప్పుకున్నాడు. ఇలా సైకిల్ పై రోజుకు 15 లోపే ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు చెప్పాడు. దీంతో ఆదిత్య శర్మ.. ఏదైనా సాయం కావాలా అని అడగడంతో.. దుర్గా తన మనసులోని మాటను బయటపెట్టాడు.
తనకు ఫైనాన్స్ లో డౌన్ పేమెంట్ కట్టే ఆర్ధిక స్థోమత లేదని.. డౌన్ పేమెంట్ కట్టి.. బైక్ కొనిస్తే.. EMIలు తానే కట్టుకుంటానని చెప్పాడు. బైక్ ఉంటే మరిన్ని డెలివరీలు చేసి, వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో ఆదిత్య శర్మ ఆ విషయాన్ని తన ట్విట్టర్ లో పెట్టాడు. క్రౌడ్ ఫండింగ్ కు వెళ్లడంతో 24 గంటలు గడిచేలోగా డబ్బులు, కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. బైక్ కొనుగోలకు అవసరమైన మొత్తానికి డబుల్ గా డబ్బులు వచ్చేశాయి. దీంతో ఆదిత్య శర్మ.. దుర్గా మీనా కలిసి బైక్ కొన్నారు. తాను బైక్ కొనుగోలు చేసేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ దుర్గా ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పారు.