కత్తులు, తుపాకులు చూపించి, బెదిరించి దోచుకోవడం చాలా సహజంగా జరిగేదే. అయితే ఇప్పుడో కొత్త టెక్నిక్ నేర్చుకున్నారు కేటుగాళ్లు. పాముల్ని చూపించి బెదిరించి దోచుకోవడం ఇప్పుడో కొత్త దోపిడీ విద్య. గౌతమ్, గగన్ అనే యువకులిద్దరూ కారులో పోతుండగా ఇద్దరు మహిళలు ఆపారు. వారు ఏం చెబుతున్నారో విందామని కారు అద్దాలు తీశారు. ఆ వెంటనే పాములు లోపలికి వదిలిపెడతామంటూ బెదిరించసాగారు. తమకు డబ్బులు కావాలని, ఇవ్వకుండా పోతే పాములు కారులో వదిలేస్తామని బెదిరించారు. దీంతో తమ వద్ద డబ్బులు లేవని ఆ యువకులు చెప్పడంతో చేతికి ఉన్న ఉంగరాలు, వాచి, సెల్ ఫోన్ తీసుకుని వారిని పంపించారు. ఈ విధంగా చాలా చోట్ల ఈ ముఠా ఇదే పని చేస్తోందని తేలింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఆ పాముల్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఇందిరా వికాస్ ప్రాంతంలో ఇలాంటి పాములు చూపించి దోపిడీ చేసే ముఠా ఇటీవల కాలంలో ఎక్కువైందని చెబుతున్నారు. దీనికి సపేరా గ్యాంగ్ అని పేరు పెట్టారు.