కొడుకుల్ని ఎత్తుకున్నాడు… మనవళ్ళతో ఆడుకున్నాడు… మునివళ్ళని చూశాడు… ఇంతకంటే భాగ్యం ఏం కావాలి ? ఇప్పుడు ఆయన వయసు సరిగ్గా నూరేళ్ళు. 1921లో జన్మించాడు. ఆయనే పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు గ్రామానికి చెందిన రొంగాల రాముడు. ఇంతకీ ఈయన గురించి ఎందుకు చెబుతున్నామంటే… ఆయనకు విమానం ఎక్కాలని, గాల్లో తిరగాలనే కోరిక ఉంది. అది నూరేళ్ళ వయసులో తీరింది. ముని మనవళ్ళు ఆయన కోరిక తీర్చారు.
బెంగుళూరులో నివాసం ఉంటున్న మునిమనవడు ఇంటికి వెళ్ళాడు రొంగాల రాముడు. సరిగ్గా ఈరోజే ఆయన పుట్టిన రోజు. ముత్తాతకు మంచి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు అరవింద్ అనే మునిమనవడు. మొత్తం ఐదు మంది మునివళ్ళు ఆయనకు. అందరినీ ఒక్కచోటికి చేర్చాడు అరవింద్. అందరూ కలిసి ముత్తాత కోరికను తీర్చాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా.. టూ సీటర్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ బుక్ చేశారు. అందులో ముత్తాతను ఎక్కించారు.
అంతే ఆ ముత్తాత ఆనందానికి హద్దుల్లేవు. విమానంలో రయ్ మంటూ చక్కర్లు కొట్టాడు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో పక్కనే ఉన్న లేడీ పైలెట్.. ఆ పెద్దాయనకు ఫ్లైట్ గురించి వివరాలు చెబుతూ కాసేపు కబర్లు చెప్పింది. మొత్తం 12 నిమిషాల పాటు ఆ ముసలాయన గాల్లో షికార్లు చేశాడు. ఇంక ఫ్లైట్ దిగిన తర్వాత రొంగాల రాముడి ఆనందాన్ని అవధుల్లేవు. ఎంత గొప్ప బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన మునిమనవళ్ళను చూసి పొంగిపోయింది ఆ ముదుసలి హృదయం.
ఇవీ చదవండి..