తమిళనాడులోని రాయ్ వెల్లూర్ మున్సిపాలిటీ లో చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. పార్కింగ్‌లో బైక్ ఉందన్న సంగతి మర్చిపోయి… సిమెంట్ రోడ్ వేసేశారు. ఇంకేముంది.. బైక్ అలా స్టాట్యూలాగా ఉండిపోయింది. కమిషనర్ జోక్యంతో ఈ బైక్ మళ్ళీ ముందుకు కదిలింది. వివరాల్లోకి వెళితే..
రాయ్ వెల్లూరు మున్సిపాలిటీలోని కాలియమ్మన్ కోయిల్ వీధిలో మురుగన్ అనే వ్యక్తి పార్కింగ్ పాయింట్‌లో బైక్ పార్క్ చేశాడు. అక్కడే ఉన్న కాంప్లెక్స్ లోని తన షాపులోకి వెళ్ళిపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో వచ్చి చూసేసరికి… సిమెంట్ రోడ్డులో ఇరుక్కుపోయినట్లు గుర్తించాడు. ఆ రోడ్డులో సిమెంట్ రోడ్ వేశారన్నమాట. అయితే సిమెంట్ రోడ్ వేసే సమయంలో బైక్ పక్కకి తీయడంగానీ, బైక్ యజమానికిగానీ సమాచారం ఇవ్వకుండా సిమెంట్ రోడ్ వేసేశారు. దీంతో బైక్ స్టాండ్, టైర్స్ అన్నీ సిమెంట్ రోడ్డులో ఇరుక్కుపోయింది.
దీంతో మురుగున్ మున్సిపాలిటీ కమిషనర్ అశోక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వచ్చి బైక్ ఇరుక్కుపోయిన ప్రదేశాన్ని, సిమెంట్ రోడ్ వేసిన విధానాన్ని స్వయంగా పరిశీలించారు. చివరికి బైక్ ఇరుక్కుపోయిన ప్రదేశం వరకు.. సిమెంట్ రోడ్డును తొలగించి బైక్ ను తీయించారు. అనంతరం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటానని మురుగన్‌కు హామీ ఇచ్చారు.