రాసుకొని తిరిగారు.. ఏం తెచ్చారు..ఏం పీకారు..

  0
  336

  ‘మా’ ఎన్నిక‌లు ఈసారి చాలా ట‌ఫ్‌గా జ‌ర‌గ‌నుంది. రేసులో ఎంత‌మంది ఉన్నా ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణుల మ‌ధ్య గ‌ట్టి పోటీ జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. సెప్టెంబ‌ర్ లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ ఇప్ప‌టికే త‌న ప్యానెల్ ప్ర‌క‌టించి అంద‌రి కంటే ఒక అడుగు ముందులో ఉన్నారు. మెగా ఫ్యామిలీ అండ‌తో ఆయ‌న దూకుడు పెంచుతున్నారు. కాగా మంచు విష్ణు కూడా కృష్ణ‌, కృష్ణంరాజు, మ‌హేష్ బాబు లాంటి ఉద్దండుల స‌పోర్టు తీసుకున్నారు. దీంతో ‘మా’ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇటీవ‌ల మంచు విష్ణు… ‘మా’ భవంతి నిర్మాణానికి ఎవరూ ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని తానే నిర్మిస్తానని ప్రకటించి విష్ణు కలకలం సృష్టించారు. దీనికితోడు అధ్య‌క్ష ప‌ద‌విని ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటే తాను పోటీ నుంచి త‌ప్పుకుంటాన‌ని కూడా ప్ర‌క‌టించి అగ్గిరాజేశారు. విష్ణు చేసిన వ్యాఖ్య‌లు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి.

  అయితే తాజాగా నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ‘మా’ ఎన్నిక‌ల‌పై స్పందించారు. ‘మా’ అసోసియేషన్ కోసం ఇంతవరకు బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకొని పూసుకొని తిరుగుతున్న సినీ పెద్దలు బిల్డింగ్ కోసం ఒక్క‌ ఎకరం భూమి సాధించలేరా? అని నిలదీశారు. గతంలో ‘మా’ అసోసియేషన్ లో ఉన్నవాళ్లు ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ ఫస్ట్ క్లాస్ టికెట్లతో విమానాల్లో తిరిగారని… ఆ కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని నిల‌దీశారు. పరిశ్రమలో అందరూ కలిస్తే అసోసియేషన్ కోసం ‘మయసభ’ లాంటి అద్భుతమైన భవనాన్ని కట్టుకోవచ్చన్నారు. ‘మా’ భవంతి నిర్మాణం విషయంలో విష్ణు ముందు తాను నిలుచుంటానని, అన్నివిధాలా సహకరిస్తానని తెలిపారు. లోకల్, నాన్ లోకల్ అనే విషయాలను తాను పట్టించుకోనని తెలిపారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఇలాంటివి బహిరంగంగా చర్చించుకోవడం సరికాదని బాలయ్య ఈ సందర్భంగా అన్నారు.

  బాల‌య్య చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ‘మా’ భ‌వంతి కోసం ప్ర‌భుత్వం నుంచి ఒక్క ఎక‌రం కూడా సాధించ‌లేక‌పోయారా ? అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప‌రోక్షంగా చిరంజీవి, నాగార్జున‌ల‌ను ఉద్దేశించి చేసిన‌వే అని చ‌ర్చించుకుంటున్నారు. అందుకు కార‌ణం గ‌తంలో వారు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యి, సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించ‌డ‌మే. హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని కేసీఆర్ ప్ర‌క‌టించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్ళి అక్కడి సినిమా సిటీని పరిశీలించి రావాలని, ‘సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్’ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇంత‌వ‌ర‌కు అది కార్య‌రూపం దాల్చ‌లేదు. ఒక్క ఎక‌రం కూడా ఇండ‌స్ట్రీ కోసం సంపాదించ‌లేదు. దీంతో బాల‌య్య డైరెక్టుగానే ‘మా’ ఎన్నిక‌ల‌ను అడ్డం పెట్టుకుని సినీ పెద్ద‌ల‌మ‌ని చెప్పుకునేవారికి ఇలా చుర‌క‌లు అంటించార‌ని చెప్పుకుంటున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.