టాలీవుడ్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్. సినిమా టిక్కెట్ ధరలను తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవోను న్యాయస్థానం కొట్టి వేసింది. పాత విధానంలో టికెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటును థియేటర్ యాజమాన్యాలకు కల్పించింది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసును విచారించిన న్యాయస్థానం పిటీషనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పిటీషనర్ల తరపున లాయర్లు దుర్గాప్రసాద్, ఆదినారాయణరావులు తమ వాదనలు వినిపించారు. సినిమాల విడుదల విషయంలో టిక్కెట్ల ధరలను పెంచుకునే హక్కు థియేటర్ యాజమాన్యాలకు ఉందని, నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. వారి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35ను సస్పెండ్ చేసింది.