ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సంచలనమైన తీర్పును వెలువరించింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన ఐఏఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది. హైస్కూల్ ప్రాంగణాల్లో, ప్రభుత్వ స్థలాల్లో గ్రామ సచివాలయ భవనాలను నిర్మిస్తున్నారని దాఖలైన పిటీషన్‌పై గతంలో న్యాయస్థానం.. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడంతో సీరియస్ అయ్యింది. కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తూ ఈరోజు తీర్పు వెలువరించింది.
కోర్టు ధిక్కరణ కింద 2 వారాల జైలు శిక్ష విధించింది. దీంతో హైకోర్టును అధికారులు క్షమాపణలు కోరడంతో, జైలు శిక్ష నుంచి విముక్తి కలిగించింది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశాలు జారీ చేసింది. సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు నెలలో ఒకరోజు సేవ చేయాలని ఆదేశించింది. జైలు శిక్షకు గురైన అధికారుల్లో గోపాలకృష్ణ ద్వివేది, శ్రీలక్ష్మి, చినవీరభద్రుడు, రాజశేఖర్, గిరిజా శంకర్, జె.శ్యామలరావు, విజయ్ కుమార్, ఎంఎం నాయక్ ఉన్నారు.