అత్యాశకు పోయి కటకటాల పాలైన 108 సిబ్బంది…

  0
  2300

  నర్సరావుపేట బంగారం వర్తకులు దుర్మరణం పాలైన రోడ్డు ప్రమాదంలో దాదాపు రెండున్నర కేజీల బంగారాన్ని మాయం చేశారు 108 సిబ్బంది. గతంలో జరిగిన రెండు ప్రమాదాల్లో 108 వాహన డ్రైవర్, సహాయకుడు.. డబ్బు, నగలు పోలీసులకు తిరిగిచ్చేశారు. అదే క్రమంలో వారి నిజాయితీని శంకించని పోలీసులు ఈ కేసులో కూడా అలాగే చేశారనుకున్నారు. కానీ.. 3కేజీల 300 గ్రాముల బంగారాన్ని పోలీసులకు ఇచ్చిన 108 సిబ్బంది 2కేజీల 300 గ్రాముల బంగారాన్ని నొక్కేశారు. ఈ క్రమంలో పోలీసు విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.

  రోడ్డు ప్రమాదం ఘటనలో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైన కేసును రామగుండం పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లి వద్ద నిన్న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం వర్తకులు, అన్నదమ్ములు కొత్త శ్రీనివాసరావు (55), రాంబాబు (45) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో వారి గుమస్తా గుండా సంతోష్‌, కారు డ్రైవర్‌ డి.సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రాజీవ్‌ రహదారిపై డివైడర్‌ను కారు ఢీకొనడంతోపాటు వంద అడుగుల దూరంలో ఉన్న సిగ్నల్ బోర్డ్ స్తంభాన్ని బలంగా తాకి పక్కనున్న కాల్వలోకి పడిపోయింది.

  ప్రమాదం జరిగిన వెంటనే కొన ఊపిరితో ఉన్న రాంబాబు, గుండా సంతోష్‌, డి.సంతోష్‌లను 108 వాహనంలో గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల వెంట సుమారు 5కేజీల 600 గ్రాముల బంగారం ఉందని బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే, 108 సిబ్బంది 3 కిలోల 300 గ్రాముల బంగారాన్ని ఎస్‌ఐ శైలజకు అప్పగించారు. వ్యాపారుల వద్ద ఉన్న మరో 2 కిలోల 300 గ్రాముల బంగారం మాయమైనట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు.

  ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న 108 డ్రైవర్‌ గుండా లక్ష్మారెడ్డి, ఎమర్జెన్సీ టెక్నీషియన్‌ తాజుద్దీన్‌ 2 కిలోల 300 గ్రాముల బంగారాన్ని దాచి పెట్టారు. తమకు 2కేజీల 300 గ్రాముల బంగారం దొరికిందని పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 108 సిబ్బందిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. బంగారానికి సంబంధించిన అన్ని బిల్లులను పరిశీలించిన తర్వాతే బాధితులకు అప్పగిస్తామని సీపీ వివరించారు. ప్రమాదం నుంచి ఎంతో మందిని కాపాడిన 108 సిబ్బంది అత్యాశ వారికి చెడ్డపేరు వచ్చేలా చేసిందని సీపీ వ్యాఖ్యానించారు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?