ఏపీ కొత్త కేబినెట్ కొలువుదీరే సమయం దగ్గర పడుతోంది. ఈనెల 11వ తేదీ అధికారిక ముహూర్తం నిర్ణయించడంతో.. కొత్త మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందో అని ఉత్కంఠ సర్వత్రా పెరుగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్ తో సుదీర్ఘంగా చర్చించారు. అంతిమంగా ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో పాత క్యాబినెట్‌లోని 8 మంది నుంచి 10 మందికి కొత్త కేబినెట్ లో చోటు దక్కే అవకాశముంది. ముగ్గురు సీనియర్లని, మిగిలిన వారిని సామాజిక వర్గాల ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు సమాచారం.
సీనియర్ల జాబితాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని పేర్లు ఉన్నాయి. కొడాలి నాని సీనియర్ కాకపోయినా, ప్రతిపక్షాన్ని బలంగా కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషిస్తారనే ఆలోచనతో.. ఆయనను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక సామాజిక వర్గాల ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే ఆదిమూలపు సురేష్, వేణు గోపాల కృష్ణ , అప్పలరాజు, శంకర్ నారాయణ, తానేటి వనిత, జయరామ్ లను కంటిన్యూ చేసే అవకాశముంది. వారిని మినహాయించి కేబినెట్ విస్తరణలో కొత్త వారికి స్థానం కల్పించనున్నారు. ఇప్పటికే జాబితా పూర్తయిందని సమాచారం. కాసేపట్లో సీఎం జగన్ కోర్ కమిటీతో చర్చించనున్నారు. ఇక కొత్తమంత్రుల జాబితాను రేపు ప్రకటించే అవకాశముంది.
ఇదిలావుంటే రేపు మద్యాహ్నం గానీ, సాయంత్రంగానీ సీఎం జగన్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వద్దకు వెళ్ళి మంత్రుల రాజీనామాలను సమర్పించడంతో పాటు కొత్త మంత్రుల జాబితాను అందచేయనున్నారు. గవర్నర్ ఆమోదం తర్వాత 11వ తేదీ 11.31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సచివాలయంలో కొత్తమంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం 1 గంటకు పాత, కొత్త మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ తేనీటి విందులో పాల్గొననున్నారు.