తమిళ హీరోలు ఎందుకు రాలేదు..

  0
  77944

  శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ముగిశాయి. బెంగళూరులోని తల్లిదండ్రులు పార్వతమ్మ, రాజ్ కుమార్ సమాధుల పక్కనే పునీత్ భౌతిక కాయాన్ని అశ్రున‌య‌నాల మ‌ధ్య ఖననం చేశారు. సినీ సెల‌బ్రిటీలు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు, వేలాది మంది అభిమానులు పునీత్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, చిరంజీవి వంటి అగ్ర‌న‌టులు పునీత్ కు నివాళులు అర్పించి క‌డ‌సారి వీడ్కోలు ప‌లికారు. మాలీవుడ్ నుంచి కూడా కొంత‌మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. కానీ కోలీవుడ్ నుంచి మాత్రం ఒక్క సినీ సెల‌బ్రిటీ కూడా హాజ‌రుకాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

  పునీత్ రాజ్ కుమార్ త‌మిళ‌నాడులో అభిమానులు ఉన్నారు. కోలీవుడ్ యంగ్ హీరోల‌తో మంచి సంబంధాలు, స్నేహాలు కూడా ఉన్నాయి. విజ‌య్, విశాల్, అగ్ర‌న‌టులైన ర‌జ‌నీ, క‌మ‌ల్ తో కూడా సాన్నిహిత్యం ఉంది. అలాంటి పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన త‌ర్వాత ఏ ఒక్క‌రూ కూడా ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి త‌ర‌లి వెళ్ళ‌క‌పోవ‌డం శోచ‌నీయం. ట్విట్ట‌ర్ల‌లో, ఫేస్ బుక్ ఇత‌ర‌త్రా సోష‌ల్ మీడియాలో పునీత్ మ‌ర‌ణ‌వార్త ప‌ట్ల దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తూ, సంతాపం ప్ర‌క‌టించారే త‌ప్ప‌, నేరుగా వెళ్ళింది లేదు. ఇందుకు కార‌ణం ఏమ‌య్యుంటుందా అనేదే అంద‌రి ప్ర‌శ్న‌. బ‌హుశా కావేరీ న‌దీ జ‌లాల గొడ‌వ కార‌ణంగానే ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చింద‌ని విశ్లేష‌కుల మాట‌.

  కావేరీ న‌దీ జ‌లాల వివాదం ద‌శాబ్దాలుగా జ‌రుగుతూనే ఉంది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్ళిందీ వివాదం. ట్రిబ్యున‌ల్, కావేరీ రివర్ అథారిటీ, కావేరీ మానిటరింగ్ కమిటీలు ఇలా ఎన్ని ఉన్నా, ఏ ఒక్క‌దానితోనూ క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య కావేరీ న‌దీ జ‌లాల వివాదం ప‌రిష్కారం కాలేదు. దీంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య ప్ర‌చ్చ‌న్న యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. అయితే జ‌లాల పంపిణీలో త‌మిళ‌నాడుకు వాటా ఇవ్వాల‌న్న సుప్రీంకోర్టు తీర్పుతో క‌ర్నాట‌క‌లో ఆగ్ర‌హావేశాలు క‌ట్ట‌లు తెంచుకున్న సందర్భాలున్నాయి. అదే స‌మ‌యంలో శాండిల్ వుడ్ హీరోలు ఈ వివాదంపై రోడ్డెక్కారు. ధ‌ర్నాలు చేశారు. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. ఈ వివాదం ముదిరిపాకాన ప‌డ‌డంతో బెంగళూరులోని తమిళ ప్రజలపై దాడులు చేసే దాకా వెళ్లింది. తమిళనాడు వాహనాలు తమ రాష్ట్రంలోకి రాకుండా క‌న్న‌డిగులు అడ్డుకున్నారు. కర్ణాటకలో తమిళ ఛానళ్ల ప్రసారాలను నిషేధించారు. తమిళ సినిమాలను సైతం నిషేధించారు. అందుకు ధీటుగా కోలీవుడ్ హీరోలు కూడా క‌దం తొక్కారు. శాండిల్ వుడ్ హీరోల తీరును గ‌ర్హించారు. క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌ల‌ చ‌ర్య‌ల‌ను ముక్త‌కంఠంతో ఖండించారు. బ‌హుశా ఈ కార‌ణంగానే పునీత్ రాజ్ కుమార్ అంత్య‌క్రియ‌ల‌కు కోలీవుడ్ నుంచి హాజ‌రుకాలేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

  ఇదంతా గ‌తం. ఇప్పుడు వ‌ర్త‌మానం. అవ‌న్నీ రాజ‌కీయాలు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలతో ముడిప‌డి ఉన్న అంశాలు. దీన్ని వ్య‌క్తిగ‌త కోణంలో చూడ‌డం స‌రైంది కాద‌నేది అభిమానులు, సినీ విశ్లేష‌కుల మాట‌. నటీన‌టులంద‌రూ క‌ళామ‌త‌ల్లి బిడ్డ‌లే. అలాంటిది క‌న్న‌డ చిత్ర‌సీమ‌లో ప‌వ‌ర్ స్టార్ గా వెలుగొందిన పునీత్ రాజ్ కుమార్ స‌డ‌న్ గా మృతి చెంద‌డం బాధాక‌ర‌మైన విష‌యం. ఇలాంటి విష‌యంలో, ప‌ల‌క‌రింపు విష‌యంలో, ప్ర‌త్య‌క్షంగా హాజ‌రై నివాళులు అర్పించే విష‌యంలో కోలీవుడ్ చిత్ర ప్ర‌ముఖులు దూరంగా ఉండ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం. ఇది స‌రైన‌దేనా అనేది అంద‌రి ప్ర‌శ్న‌.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..