పద్మ పురస్కారాల ప్రదామోత్సవం సందర్భంగా మీడియా అంతా సెలబ్రిటీలపై ఫోకస్ పెట్టింది. పీవీ సింధు, కంగనా రనౌత్.. ఇలా సెలబ్రిటీలు పురస్కారాన్ని తీసుకునేటప్పుడు, ఆ తర్వాత వారి గురించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేసింది. అయితే సోషల్ మీడియా మాత్రం తులసి గౌడ వంటి సామాన్య మహిళలను హైలెట్ చేసింది. 76 ఏళ్ల తులసి గౌడ 40వేల మొక్కలు నాటి పర్యావరణ ప్రేమికురాలిగా పేరు తెచ్చుకుంది. అందుకే ఆమెను పద్మ పురస్కారం వరించింది. ఆ పెద్దావిడను చూడగానే మోదీ కూడా ఎంతో గౌరవంగా ప్రతినమస్కారం చేయడం అక్కడున్న అందర్నీ ఆకర్షించింది.
తులసి నేపథ్యం ఇదీ..
కర్ణాటకలోని అంకోలా తాలూకా హొన్నాలి గ్రామానికి చెందిన తులసి గౌడ.. హలక్కీ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. దీంతో పూట గడవడానికి రోజూ తల్లితో కలిసి కూలీకి వెళ్లేది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరమవడంతో తులసికి చదవడం, రాయడం రాదు. 10-12 ఏళ్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె భర్త మరణించాడు. తన జీవితంలో చీకట్లు కమ్మినందుకు ఆమె ఎప్పుడూ కుంగిపోయేది. దీని నుంచి బయటపడటానికి నిత్యం దగ్గర్లోని అడవిలో గడిపేది. అక్కడి చెట్లే ఆమెకు ఓదార్పునిచ్చేవి. ఆనందాన్నిచ్చేవి. అలా ఆమెకు అడవితో బంధం ఏర్పడింది.
అటవీశాఖలో ఉద్యోగం..
చిన్నతనం నుంచే తులసికి మొక్కలంటే ప్రాణం. ఎన్నో రకాల మొక్కలు నాటేది. రాను రాను అదే తన జీవితం అయిపోయింది. ఆమె మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం చూసి అటవీ శాఖ అధికారులు ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. ఆమె అంకితభావం చూసి కొన్నాళ్లకు ఆమెను శాశ్వత ఉద్యోగిగా నియమించారు.
పద్నాలుగేళ్ల పాటు అటవీశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అయితే మొక్కల పెంపకాన్ని మాత్రం ఆపలేదు. అరవై ఏళ్లలో తులసి నలభై వేలకు పైగా మొక్కలు నాటి వాటిని పెంచారు.