బిడ్డకోసం 24 ఏళ్ళు అన్వేషణ ఫలించిన వేళ ..

  0
  1451

  ఇది క‌ధ కాదు… సినిమా అంత‌క‌న్నా కాదు… క‌నిపించ‌కుండా పోయిన కొడుకు కోసం ఓ తండ్రి ప‌డిన యాత‌న‌. బిడ్డ ఆచూకీ కోసం సాగించిన అన్వేష‌ణ‌. అన్వేష‌ణ అనే కంటే సాహ‌స‌యాత్ర అని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే రెండేళ్ళ వ‌య‌సులో క‌నిపించ‌కుండా పోయిన కొడుకు కోసం, ఓ తండ్రి ఏకంగా 24 ఏళ్ళ పాటు నిరంత‌రం అన్వేషించాడు. క‌న్న కొడుకు కోసం ఆ తండ్రి ప‌డిన‌ వేద‌నకు ఇది సాక్ష్యం. ఎట్ట‌కేల‌కు క‌న్న‌కొడుకును క‌లుసుకోగ‌లిగాడు. దాదాపు రెండున్న‌ర ద‌శాబ్దాల ఆ తండ్రి అన్వేష‌ణ ఫ‌లించింది. ఈ ఘ‌ట‌న చైనా దేశంలో జ‌రిగింది.

  ఆ తండ్రి పేరు గాంటాంగ్. హెనాన్ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి. 1997లో త‌న రెండేళ్ళ కొడుకును ఎవ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. అప్ప‌టి నుంచి కొడుకు కోసం వెద‌క‌ని చోటు లేదు… తిర‌గ‌ని ప్ర‌దేశం లేదు. బైక్ కి ముందుభాగంలో కొడుకు ఫోటో పెట్టుకుని క‌నిపించిన ప్ర‌తివారిని అడుగుతూ, రోజులు కాదు.. నెల‌లు కాదు… సంవ‌త్స‌రాలు కాదు.. ఏకంగా రెండున్న‌ర ద‌శాబ్దాల పాటు కొడుకు కోసం అన్వేషించాడు. అలా 5 ల‌క్ష‌ల కిలో మీట‌ర్లు ప్ర‌యాణం చేశాడు. కొడుకు ఆచూకీ కోసం దేశం మొత్తం తిరుగుతూ ఆస్తులు పోగొట్టుకున్నాడు. అనారోగ్యం పాల‌య్యాడు. ప్ర‌మాదాల బారిన ప‌డ్డాడు. అయినా వెర‌వ‌లేదు. ఆశ‌ను వ‌దిలేయ‌లేదు. కొడుకు ఏనాటికైనా క‌నిపిస్తాడ‌న్న చిన్న ఆశతో ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా త‌న అన్వేష‌ణ కొన‌సాగించాడు. ఆ తండ్రి ప్రేమ మ‌హిమో… లేక‌, భ‌గ‌వంతుడి లీల తెలియ‌దు కానీ, ఆ చిన్న కుర్రాడు పెరిగి పెద్ద‌వాడై తండ్రికి చేరువ‌య్యాడు.

  విచిత్రంగా కొడుకు ఎక్క‌డ క‌నిపించ‌కుండా పోయాడో… తిరిగి అదే ప్ర‌దేశం హెనాన్ టౌన్ లోనే దొర‌క‌డం విశేషం. ఇప్పుడు ఆ పిల్లాడి వ‌య‌సు 26 ఏళ్ళు. పెరిగి పెద్ద‌వాడై టీచ‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. కిడ్నాప్ కి గురైన ఆ కుర్రాడు ఇత‌రుల వ‌ద్ద పెరిగి ప్ర‌యోజ‌కుడ‌య్యాడు. రెండేళ్ళ వ‌య‌సులో త‌ప్పిపోయిన ఆ పిల్లాడు… పెద్ద‌య్యేనాటికి త‌న క‌న్న త‌ల్లిదండ్రుల‌ను గుర్తుప‌ట్ట లేక‌పోయాడు. అయితే చివ‌రికి కొడుకు చెంత‌కు చేర‌డంతో ఆ తండ్రి ఆనందానికి హ‌ద్దుల్లేవు. డీఎన్ఏ టెస్టులు కూడా ఆ ఇద్ద‌రూ తండ్రీకొడుకులు అని నిర్ధారించాయి. 24 ఏళ్ళ అన్వేష‌ణ ఫ‌లిచండంతో గాంటాంగ్ సంతోషానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. కొడుకు కోసం ఆయ‌న చేసిన సాహ‌సం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ తండ్రి ప్రేమ‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతూ ప్ర‌శంస‌ల‌కు కురిపిస్తున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.