తిరుపతికి ఆక్సిజన్ పై తమినాడు వేటు.

    0
    39
    కరోనా రోగులకు ఆసరాగా నిలుస్తున్న తిరుపతి స్విమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో.. ఆక్సిజన్‌ సంక్షోభం తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే పాజిటివ్‌ కేసులతో పడకలన్నీ నిండిపోగా.. 90 శాతానికి పైగా రోగులు ఆక్సిజన్‌ సపోర్టు మీదే చికిత్స పొందుతున్నారు. 15 ఏళ్లుగా తమిళనాడు నుంచి ప్రాణవాయువు సరఫరా అవుతుండగా.. వాటాలో కోత విధించాలని అక్కడి ప్రభుత్వం గుత్తేదారును ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతి స్విమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో మొత్తం 145 ఐసీయూ, 328 ఆక్సిజన్‌ పడకలున్నాయి. వీటిలో 40 వెంటిలేటర్లు సైతం ఉన్నాయి. ఇక్కడి కొవిడ్‌ రోగుల అవసరాల నిమిత్తం 22 వేల లీటర్ల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వ ఉంచేలా.. 11 కిలోలీటర్ల సామర్థ్యంతో రెండు స్టోరేజ్‌ ట్యాంకులను ఏర్పాటు చేశారు.
    కరోనా ఆసుపత్రి కోసం ప్రత్యేకంగా 11 కెఎల్ ఆక్సిజన్‌ ట్యాంక్‌ కేటాయించగా.. ప్రత్యామ్నాయంగా 220 మ్యానిఫోల్డ్‌ బల్క్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచారు. 15 ఏళ్లుగా తమిళనాడులోని ఎయిర్‌వాటర్‌ కంపెనీ నుంచి స్విమ్స్‌కు ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. రెండు ట్రిప్పుల్లో సుమారు 14వేల లీటర్ల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ అందుతోంది.
    అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు.. గుత్తేదారు కంపెనీని ఇరకాటంలో పడేశాయి. సొంత రాష్ట్రంలో రోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. పొరుగు రాష్ట్రాలకు పంపే ఆక్సిజన్‌ సరఫరాలో కోత విధించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా ఇప్పటివరకూ 14 వేల లీటర్ల ఎల్ఎంవోను సరఫరా చేసిన సదరు సంస్థ.. ఇకపై కేవలం 8వేల లీటర్ల మెడికల్‌ ఆక్సిజన్‌ మాత్రమే పంపిస్తామని స్విమ్స్‌కు లేఖ రాయడం ఆందోళన రేకెత్తిస్తోంది.