డొక్కు స్కూటర్.. మారుతీ కారు..
ఇంట్లో మాత్రం వందల కోట్ల డబ్బులు..
=======================
యూపీలోని కాన్పూర్ లో కోట్లాది రూపాయలు ఇంట్లో పెట్టుకొని.. దేశంలో సంచలనం సృష్టించిన పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్, ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాడు. దాదాపుగా 257 కోట్ల రూపాయలను ఇంట్లో, ఆఫీసులో దాచి ఉంచిన పీయూష్, ఒక్క రోజులోనే దేశం మొత్తం తెలిసిపోయాడు. అతగాడి ఇంట్లో ఉండే డబ్బును లెక్కపెట్టడానికే అధికారులకు నాలుగు రోజుల సమయం పట్టియిందంటేనే అర్ధం చేసుకోవచ్చు. దాదాపుగా 20 మెషిన్లతో బ్యాంకు సిబ్బంది లెక్కపెడితే గానీ పూర్తిగా లెక్కలు తేలలేదు. ఇదంతా లెక్కల్లో చూపని మొత్తమని అధికారులు చెబుతున్నారు.
అయితే పీయూష్ గురించి ఇప్పుడు ఆసక్తికరమైన మరొక వార్త బయటికొచ్చింది. ఇంత డబ్బు ఉన్నప్పటికీ పీయూష్ చాలా సాధారణ జీవితం గడిపేవాడిని స్థానికులు చెబుతున్నారు. పీయూష్ ఎప్పుడు బయటకు వచ్చినా ఒక డొక్కు బజాజ్ స్కూటర్ మీదనే వచ్చేవాడని తెలుస్తోంది. తన ఇంట్లోకూడా సాధారణ క్వాలిస్ వాహనం, మారుతీ కారు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. వీటిని కూడా చాలా అరుదుగా ఉపయోగిస్తాడని స్థానికులు అంటున్నారు. పీయూష్ ఎప్పుడూ బజాజ్ బండిపై వెళ్లడం చూసిన స్థానికులు కూడా ఆయన సింప్లిసిటీకి ఆశ్చర్యపోయేవారట. తీరా ఇప్పుడు అసలు విషయం బయటకు తెలిసి, ముక్కున వేలేసుకుంటున్నారట.