అంతర్జాతీయ బాలికా దినోత్సవం అక్టోబరు 11న నిర్వహించిన కార్యక్రమంలో రాజస్థాన్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోస్తారా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. ఓ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా టీచర్ల వల్ల స్కూళ్ళల్లో తగాదాలు జరుగుతున్నాయని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంతటితో ఆగకుండా వీళ్ళు ఎక్కడుంటే అక్కడ గొడవలు, సమస్యలు వస్తున్నాయంటూ నోరు జారారు. వీళ్ళ కారణంగానే మగ టీచర్లకు కూడా కొట్టుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో అక్కడ ఉన్న చిన్నారులు కూడా అవాక్కయ్యారు. ఎంతో బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, అందులోనూ విద్యాశాఖ మంత్రిగా ఉన్న గోవింద్ సింగ్, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.