మన దేశంలో బాలికల వివాహ వయసు పెంచారు. ఇప్పటివరకు అమ్మాయిలకు ఉన్న వయో పరిమితిని 21 ఏళ్ళకు పెంచుతూ చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. దీంతో 21 ఏళ్ళ లోపు అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటే బాల్య వివాహం కిందనే పరిగణిస్తారు. ఒకరకంగా అది శిక్షార్హం కూడా. ఈ మేరకు బాల్య వివాహాల చట్టం 2006ను సవరించారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మరియు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ను సవరణ చేశారు. అమ్మాయిల వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్ళకు పెంచాలని జయాజెట్లీ ఆధ్వర్యంలోనే నీతి ఆయోగ్ గతంలో సిఫార్సు చేసింది. అమ్మాయిల వివాహ వయసును పెంచేందుకు జనాభా నియంత్రణ ఉద్దేశ్యం కాదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. జాతీయ కుటుంబ సంక్షేమ సర్వే ప్రకారం కుటుంబ నియంత్రణ అమల్లోనే ఉందని, కుటుంబ నియంత్రణ కోసం అమ్మాయిల వివాహ వయసు పరిమితిని పెంచడం లేదని పేర్కొంది. తల్లులకు పౌష్టిక ఆహార లోపం, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే అమ్మాయిల వివాహ వయస్సు పెంచామని స్పష్టం చేసింది.