అసలే కరోనా టైం… పనులు లేక అల్లాడుతున్న జనం… ధరలు పైపైకి ఎగబాకుతున్న వైనం… ఇలాంటి సమయంలో ఎవరికైనా వంద రూపాయలు దొరికితే ఏం చేస్తారు ? ఎంచక్కా జేబులో పెట్టుకుని ఇంటికి చెక్కేస్తారు. కానీ మేరీ అనే పేదరాలు అలాంటి మనిషి కాదు. దాదాపు నాలుగున్నర లక్షల విలువ చేసే బంగారు నాణెం దొరికితే.. నేరుగా తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించి, తన నిజాయితీ చాటుకుంది. చెన్నైలోని తిరువత్తి స్ట్రీట్ లో ఈ ఘటన జరిగింది.
గణేష్ రామన్ అనే వ్యక్తి దసరా సందర్భంగా ఆయుధపూజ కోసం తన ఇంట్లోని వస్తువులతో పాటు బంగారునాణేన్ని పూజలో ఉంచాడు. అయితే ఆ నాణెం చెత్తలో కలిసిపోవడంతో, వీధిలోని చెత్త కుండీలో పడింది. ఆ తర్వాత తన బంగారు నాణెం పోయిందని గణేష్ రామన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దసరా సమయంలో ఇది జరిగింది. అయితే చెత్త ఏరుకుని జీవనం కొనసాగించే మేరీ అనే పేదరాలు, చెత్తకుండీలో చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ బాటిళ్ళు ఏరుకుంటున్న సమయంలో, చెత్తలో ఉన్న బంగారు నాణెం ఆమె కంటపడింది. వంద గ్రాముల బరువున్న ఆ బంగారు నాణెం విలువ దాదాపు నాలుగున్నర లక్షలు. దాన్ని ఆమె తనవద్దే ఉంచుకుని ఉంటే, లక్షాధికారి అయ్యి ఉండేది. కానీ ఆమె అలా చేయలేదు.
తనకు దొరికన బంగారు నాణేన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులకు అప్పగించింది. ఇది ఎవరిదో వారికి అప్పగించాలని కోరింది. అయితే అప్పటికే ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందివుండడంతో, గణేష్ రామన్ ను పోలీసులు పిలిపించారు. ఆ గోల్డ్ కాయిన్ తనదేనని యజమాని గుర్తించాడు. దీంతో ఆ బంగారు నాణేన్ని అతనికి అప్పగించారు పోలీసులు. ఇక మేరీ నిజాయితీని పోలీసులు, గణేష్ రామన్ ప్రశంసించి అభినందనలు తెలిపారు. అది బంగారు నాణెం అని తెలిసే పోలీసులకు అప్పగించానని మేరీ వినయంగా చెప్పింది.